ఫిలింనగర్‌లో ఎన్నికల వేడి..!

Thursday, July 25th, 2013, 07:30:18 PM IST


ఓ వైపు పంచాయితీ ఎన్నికలతో గ్రామాల్లో హడావిడి నెలకొంటే.. ఇటు ఫిల్మ్ నగర్ లో ‘ఫిలించాంబర్’ ఎన్నికల వేడి మొదలైంది. ఏపీ ఫిలించాంబర్‌ (ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర వాణిజ్యమండలి) ఎన్నికలు ఈ నెల 28న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలోని వాతావరణం వేడెక్కుతోంది. ఏడాదికి ఒక పర్యాయం చాంబర్‌ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షుడిగా ఉన్న కార్యవర్గం ఏడాదికాలం పూర్తిచేసుకోవడంతో ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైంది.

2013-14 సంవత్సరానికి గాను చాంబర్‌ కార్యవర్గంతో పాటు చాంబర్‌ నాలుగు విభాగాలైన ప్రొడ్యూసర్‌ సెక్టార్‌, స్టూడియో సెక్టార్‌, ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ సెక్టార్‌ కార్యనిర్వాహక సభ్యులను ఇందులో భాగంగా ఎన్నుకోబోతున్నారు. ఈ నాలుగు సెక్టార్‌లకు సంబంధించిన ఒక్కోసారి ఒక్కో సెక్టార్‌ నుంచి చాంబర్‌ అధ్యక్షుడ్ని ఎన్నుకోవడం జరుగుతుంటుంది. ప్రస్తుతం పదవిలో ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌ నుంచి ఎన్నిక కాగా తాజాగా జరుగుతున్న ఎన్నికలలో డిస్ట్రిబ్యూటర్స్‌ సెక్టార్‌ సభ్యుడే చాంబర్‌ అధ్యక్ష పదవిని అలంకరించాల్సి వుంది.

అయితే ఈ సారి జరిగే ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉండబోతున్నట్లు పరిశ్రమలోని వాతావరణం తేటతెల్లం చేస్తోంది. గత ఏడాది ఎన్నికలలో చిన్న నిర్మాతలది పైచేయి కావడంతో చాంబర్‌ కార్యవర్గం వారిచేతుల్లోకి వెళ్లింది. గత ఏడాది ప్రతిష్టాత్మకంగా దాసరి నారాయణరావు వర్సెస్‌ డి.సురేష్‌బాబుల మధ్య పోటీగా ప్రచారం జరిగింది. అయితే ఈ సారి చిన్న నిర్మాతలలో కొన్ని చీలికలు ఏర్పడ్డాయని, దానివల్ల చాంబర్‌ ఎన్నికలలో ఎవరు అంతిమ విజేతలవుతారన్న అంశం అత్యంత ఆసక్తిదాయకంగా మారిందని పరిశ్రమలో వినిపిస్తోంది. అధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి ఇంకా కార్యవర్గ సభ్యుల పదవులకు పోటీ జరగనుంది.