టీమిండియాలో మిస్టర్ సుడిగాడు..!

Friday, June 21st, 2013, 01:18:03 PM IST

టీమిండియాను అప్రతిహతంగా ఏలుతున్న జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇతడు పట్టిందల్లా బంగారమే. ఏ ముహూర్తాన ఇతడి ఒంట్లో అదృష్టం వచ్చి చేరిందో గానీ.. దశాబ్దాలైనా ఇతగాడిని వదిలేలా లేదు. టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నప్పటి నుంచీ మనోడిది ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. భారత క్రికెట్ లో రికార్డులు సాధించిన వాళ్లను చూశాం.. అపకీర్తి మూటగట్టుకున్న వాళ్లనీ చూశాం.. ఐతే మన మహేంద్రుడిని మాత్రం రికార్డులే వరిస్తాయి.. వివాదాలు వచ్చి మీద పడ్డా మనోడికున్న సుడిని చూసి పారిపోతాయి.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం భారత క్రికెట్ కే మాయని మచ్చలా మారిన తరుణంలో ధోనీ చలించలేదు.. ప్రపంచ క్రికెట్ దేశాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నా రియాక్ట్ కాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా ఉన్న తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. తన భార్య సాక్షి కూడా ఈ వివాదంలో చిక్కుకున్నా లైట్ తీసుకున్నాడు.. ఎండార్స్ మెంట్ల విషయంలో.. రిథీ స్పోర్ట్స్ వ్యవహారంలోనూ చలించలేదు. సైలెంట్ గా తనపని తాను చేసుకుపోయాడు.. ఎందుకంటే ధోనీకి తన అదృష్టంపై ఉన్న నమ్మకం అలాంటిది.

వివాదాలకు విజయాలతోనే సమాధానం
అంతా ధోనీ అనుకున్నట్టుగానే జరుగుతోంది. వివాదాలకు విజయాలతోనే సమాధానం చెబుతున్నాడు. స్వయంగా తనపై వచ్చిన ఆరోపణలు, అటు ఐపీఎల్ ఉదంతం వల్ల జట్టు పై పడిన మచ్చను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా విజయాలు సాధిస్తూ భారత క్రికెట్ అభిమానుల్లో మళ్లీ నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ లు మొదలుకుని.. సెమీ ఫైనల్ వరకు సమష్టిగా ఆడుతూ విజయాలను సాధించింది. టీం అంతా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఐపీఎల్ లో కూడా గట్టుకున్న అపకీర్తి జట్టుపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు.

సక్సెస్ క్రెడిట్ అంతా ఎవరిదీ?

ఎవరు గెలిపించారన్నది ముఖ్యం కాదు.. ఎవరి హయాంలో గెలిచిందన్నదే పాయింట్ అంటున్నాడు ధోనీ. నిజానికి టీమిండియా విజయాల్లో ఇతడి పాత్ర నామమాత్రమే. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా, భువనేశ్వర్ , ఇషాంత్ లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు టీమిండియాకు పనిచేసిన ఏ కెప్టెన్ హయాంలోనే ఇంతమంది స్టార్లు క్లిక్ అవలేదు. ధోనీకున్న సుడి వల్ల ఇదంతా కలిసొస్తోంది.

మరోవైపు ధోనీ ఆటతీరును కూడా తక్కువ అంచనా వేయలేం.. జట్టు కష్టాల్లో ఉంది.. కచ్చితంగా ఆడి తీరాలి అన్న టైంలో రెచ్చిపోతాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచే ఇందుకు నిదర్శనం. ఇలాంటి ఎన్నో సందర్భాల్లో ధోనీ మ్యాచ్ విన్నర్ గా మారాడు. గ్రౌండ్ లో ఐనా సరే.. మైదానం బయటైనా సరే…ప్రత్యర్థులకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడు ఈ జార్ఖండ్ డైనమైట్. తనదైన ఆటతీరుతో పాటు అదృష్టంతో అందరికీ సమాధానం చెబుతుంటాడు. క్రీడా ప్రపంచంలో సుడిగాళ్లకే సుడిగాడుగా తయారయ్యాడు.