‘స్పాట్ ఫిక్సింగ్’లో దావూద్, షకీల్..!

Wednesday, June 5th, 2013, 10:00:39 AM IST


‘స్పాట్ ఫిక్సింగ్’ ఉదంతంలో అనేక భయంకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కుంభకోణంలో అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరుడు చోటా షకీల్ పాత్ర ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దావూద్, షకీల్‌లను ఢిల్లీ పోలీసులు సహ నిందితులుగా చేర్చారు. హవాలా మార్గాల ద్వారా భారతదేశంలో గ్యాంబ్లింగ్‌ను దావూద్ సిండికేట్ నియంత్రిస్తోందని, గ్యాంబ్లింగ్ రేట్లను కూడా నిర్ణయిస్తోందని ఢిల్లీ పోలీసులు ట్రయల్ కోర్టుకు మంగళవారం తెలిపారు. దీనివల్లనే శ్రీశాంత్‌తో పాటు ఇతర నిందితులపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేర నిరోధక చట్టం (మోకా) కింద సెక్షన్ల కింద పోలీసులు అభియోగాలు మోపడానికి సిద్ధపడ్డారు. అయితే, ఇప్పటి వరకు దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు.

ఇక స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన శ్రీశాంత్, అజిత్ చండిలలకు కోర్టు బెయిల్ నిరాకరించింది. వారిని ఈ నెల 18వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శ్రీశాంత్ తీహార్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంత మంది బుకీలకు, ముంబై అండర్ వరల్డ్‌తో, విదేశాల్లోని వారి బాస్‌లు చోటా షకీల్ వంటి దావూద్ ఇబ్రహీం మనుషులతో సంబంధాలున్నట్లు ఆధారాలున్నాయని పోలీసులు తెలిపారు.