టీమిండియాలో కెప్టెన్సీ ఫైట్

Monday, July 8th, 2013, 08:30:50 PM IST


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి తొడకండరాలు పట్టేయడంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో విరాట్ కోహ్లీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. తొలి రెండు మ్యాచుల్లో కోహ్లీ ఫెయిలైనా.. కీలక మ్యాచ్ లో మాత్రం అద్భుతమైన సెంచరీ చేసి జట్టు గెలుపులో భాగస్వామి అయ్యాడు. ఇక్కడి వరకూ ఓకే.. ఆ తర్వాతే అసలు స్టోరీ మొదలైంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సురేశ్ రైనా రెండు క్యాచులు జారవిడిచాడు. ఈ రెండు క్యాచులు కూడా జడేజా బౌలింగ్ లోనే మిస్ చేశాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత జడేజా, రైనాతో గొడవకు దిగాడు. ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. కెప్టెన్సీ పోయింది. ఫీల్డింగ్ మీద ఆసక్తి కూడా పోయిందా..? అని అనడంతో రైనా ప్రతిస్పందించాడు. ఆ తర్వాత కోహ్లీ కలుగజేసుకోవడంతో విషయం సర్థుమణిగింది.

జడేజా మాటలను సురేశ్ రైనా సీరియస్ గా తీసుకున్నాడో లేదో గానీ.. ప్రస్తుతం టీమిండియాలో మారుతున్న సమీకరణాలు అతడి మాటలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. 2011 వెస్టిండీస్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో రైనా భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అప్పట్లో ధోని వారసుడు రైనా అంటూ ప్రచారం జరిగింది. ఇంతలో కోహ్లి తెరమీదకు వచ్చాడు. రైనా కెప్టెన్సీ ఆశలపై నీళ్లుజల్లాడు.

భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాలని ఎవరికి మాత్రం ఉండదు. నాయకుడుగా మహేంద్ర సింగ్ ధోనీ ఫెవికాల్ లాగా అతుక్కుపోయాడు.. వెస్టిండీస్ సిరీస్ లో అతడు గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంత అవకాశం వచ్చినా రైనాకు కెప్టెన్ అయ్యే అదృష్టం దక్కలేదు. విరాట్ కోహ్లీకే సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇందుకే రైనా కడుపు మంటతో ఉన్నాడన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

నిజానికి సురేశ్ రైనా, విరాట్ కోహ్లీలు ఇద్దరూ ఒకే సారి టీంలోకి ఎంటరయ్యారు. ఇద్దరూ అద్భుతంగా ఆడుతూ వస్తున్నారు. ఐతే వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా కోహ్లీకి వచ్చినన్ని అవకాశాలు రైనాకు రాకపోవడంతో అతడు కాస్త వెనుకంజలో ఉన్నాడు. ఇక కోహ్లీ మాత్రం పూర్తిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. సెంచరీలు కొడుతూ.. కీలక సమయాల్లో ఆడుతూ కెప్టెన్ నమ్మకాన్ని చూరగొన్నాడు. వైస్ కెప్టెన్ గా ఉంటూనే కెప్టెన్సీ పీఠంపై కన్నేశాడు.

ఇక జడేజా విషయానికొస్తే ఒక్కసారిగా వెలుగులోకొచ్చిన క్రికెటర్ ఇతడు.. అదృష్టమో ఏమో తెలియదు గానీ ఇతడు పట్టిందల్లా బంగారమవుతోంది. ఆల్ రౌండర్ గా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. బ్రాండ్ విషయంలోనూ, అమ్మాయిల విషయంలోనూ రైనా, కోహ్లీలతో పోటీపడుతున్నాడు. దీంతో వీళ్లలో వీళ్లకే పడటం లేదు. జడేజా తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. కోహ్లీ తర్వాత స్థానం తనదే అని తనలో తానే అనుకుంటూ ఓవర్ ఎగ్జైట్ అవుతున్నాడు. అందుకే సీనియర్ అని కూడా చూడకుండా రైనాతో గొడవకు దిగాడు.

ధోనీ లేకపోయేసరికి కెప్టెన్సీ కోసం కుర్రాళ్లలో కుమ్ములాట మొదలైంది. అది ప్రస్తుతం మొగ్గ దశలోనే ఉంది. కోహ్లీకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం రైనాకు నచ్చడం లేదు.. అటు ఇండియా ఏ జట్టులో రైనాకు చోటు కల్పించి, కోహ్లీని సెలెక్ట్ చేయలేదు.. అంటే రైనా ఇంకా నేర్చుకోవాల్సింది ఉందని సెలక్టర్లు చెప్పకనే చెప్పారు. అటు కెప్టెన్సీ కూడా ఛటేశ్వర్ పుజారాకే ఇచ్చారు. ఇవన్నీ తట్టుకోలేకపోతున్న రైనా ఆన్ ఫీల్డ్ లో కాస్త ఆదమరిచి ఉంటున్నాడని టాక్ వినిపిస్తోంది.. ఏదేమైనా మళ్లీ ధోనీ వస్తేనే ఈ పోట్లాటకు తెరపడే అవకాశముంది.