టాలీవుడ్‌కు ‘సినిమా’ కష్టాలు

Thursday, August 29th, 2013, 03:00:14 AM IST


విభజనకు సై అంటే ఒక బాధ..! నై అంటే మరో బాధ..! కరవమంటే కప్పకు.. వదలమంటే పాముకు కోపం అన్నట్టు తయారైంది పరిస్థితి తెలుగు సినిమాల పరిస్థితి. రాష్ట్రాన్ని విభజించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర కోసం కోస్తా ఆంధ్రలో సాగుతున్న ఉద్యమం తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ చిత్రాల విడుదలకు ఆటంకం ఎదురవుతోంది. పవన్ నటించిన అత్తారింటికి దారి దొరకడం లేదు.. ఎప్పటికి దొరుకుతుందో కూడా తెలియడం లేదు. రామ్ చరణ్ నటించిన ఎవడు చిత్రం విడుదల ఎప్పుడవుతుందో ప్రశ్నార్థకమే. ఈ ప్రభావం ఇతర పెద్ద చిత్రాలపై కూడా పడుతోంది. రామయ్య వస్తాడో లేదో? భాయ్ ను పలకరించే వారున్నారో? లేదో? అర్థం కావడం లేదు. ‘తుఫాన్’లా వస్తాడనుకున్న రామ్ చరణ్.. సీమాంధ్ర ఉద్యమ తుఫాన్ ను తట్టుకుంటుందా? కొట్టుకుపోతుందా? అసలు కోట్ల రూపాయలు వెచ్చించిన నిర్మాతల పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చి వేధిస్తున్నాయి.

దాదాపు మూడున్నరేళ్ళ పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడూ తెలుగు సినీ పరిశ్రమకు వ్యాపార పరంగా నష్టం జరిగింది. ఇప్పుడు తాజా సమైక్య ఉద్యమంతోనూ అదే పరిస్థితి. నిజానికి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ సమయంలోనే విడుదలైన జూనియర్‌ ఎన్టీఆర్‌ అదుర్స్‌, అల్లు అర్జున్‌ ఆర్య-2, పవన్‌కల్యాణ్‌ కెమేరామన్‌ గంగతో రాంబాబు లాంటి కొన్ని ఎంపిక చేసిన హీరోల చిత్రాలకు ఉద్యమకారుల దెబ్బతో ఆర్థికంగా నష్టం వాటిల్లింది. అయితే, ఏకంగా భారీ చిత్రాల విడుదల వాయిదా పడడం లాంటివి జరగలేదు. కానీ, ఈసారి సమైక్య ఉద్యమ సెగ చిత్రాల రిలీజ్‌ తేదీలపై పడింది. అవును. అది నిజమే! అప్పట్లో నిరసనల వల్ల కొందరు హీరోల సినిమాల ఆదాయంపై దుష్ప్రభావం పడింది. ఇప్పుడేమో, కోస్తాంధ్ర ప్రాంతంలోని పరిస్థితుల వల్ల భారీ చిత్రాలను విడుదల చేస్తే, బంద్‌ల నేపథ్యంలో అనుకున్నంత ఆదాయం రావడం లేదని నిర్మాతలు రిలీజ్‌ను పోస్ట్‌పోన్‌ చేసుకోవాల్సి వస్తోందని అంటున్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమానికి జై కొట్టి, మంత్రి పదవి రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు కేంద్రమంత్రి, నటుడు చిరంజీవి తలొగ్గకపోవడంతో, మెగా కుటుంబంలోని వ్యక్తుల చిత్రాలను అడ్డుకుంటామంటూ సమైక్య ఉద్యమకారులు బాహాటంగా ప్రకటించారు. మరోవైపు టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయడంతో, అయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రామయ్య వస్తావయ్యా’ సినిమాను తెలంగాణలో విడుదలకు అనుమతించబోమని ఓయూ జేఏసీ ప్రకటించింది.

దాంతో, భారీ మొత్తాలకు బేరం కుదుర్చుకొని, సీమాంధ్రలో రామ్‌చరణ్‌ ఎవడు, పవన్‌కల్యాణ్‌ అత్తారింటికి దారేది చిత్రాలను విడుదల చేయడానికి సిద్ధమైన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలవరపడుతున్నారు. ఉద్యమం సెగ వల్ల తాము పెట్టే భారీ పెట్టుబడికి తగ్గట్లు వసూళ్ళు రావని అనుమానిస్తున్నారు. అందుకే, ఈ పరిస్థితుల్లో సినిమా విడుదల చేస్తే మరింత దెబ్బతినాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాల విడుదల వాయిదా వేయడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చారు. ఇవన్నీ కలసి పెద్ద సినిమాలతో పాటు, చిన్న సినిమాలనూ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు ఇరకాటంలోకి నెట్టాయి. సినిమాలను ఎవరో అడ్డుకుంటారనో, ఆపుతారనో రిలీజ్‌లను పోస్ట్‌పోన్‌ చేయడం లేదు. గోదావరి జిల్లాలు, నెల్లూరు, సీడెడ్‌ లాంటి చోట్ల బంద్‌లతో, కీలకమైన తొలి వారం వసూళ్ళు తగ్గిపోయే ప్రమాదం ఉండడంతో, సినిమా విడుదలల్ని వెనక్కి నెట్టాల్సి వస్తోందని నిర్మాతలు చెబుతున్నారు.

రాష్ట్రంలో పరిస్థితులు కొంత చక్కబడిన తరువాత కూడా తెలుగు సినీ పరిశ్రమకు మరో ఇబ్బంది తప్పదు. అప్పటి దాకా రిలీజ్‌ను వాయిదా వేసుకొని కూర్చొన్న సినిమాలన్నీ ఒక దాని వెంట మరొకటిగా, చకచకా వస్తాయి. దాంతో, అందుబాటులో ఉండే హాళ్ళ సంఖ్య, వచ్చే వసూళ్ళపై ప్రభావం పడుతుంది. ఆగస్ట్‌ తొలి వారాంతంలో రంజాన్‌, ఆ వెంటనే వస్తున్న స్వాతంత్య్ర దినోత్సవంతో వరుస సెలవులు వచ్చాయి. అందుకే ఆ సమయంలో సినిమాలు విడుదల చేయాలనుకున్నారు. కానీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో సినిమాలేవీ విడుదల చేయలేకపోయారు.

రాష్ట్రంలోని పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయన్నది ఇప్పుడు బేతాళ ప్రశ్న. తెలంగాణ అనుకూల ప్రకటనతో ఇప్పుడు నైజాం ఏరియాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ, సినిమాల విడుదలకు ఇబ్బంది లేని వాతావరణముంది. కానీ, ఆంధ్రా, సీడెడ్‌ ఏరియాల్లో మాత్రం ఆవేదన, ఆగ్రహం పెల్లుబుకుతూ, సినిమాలు నడిచే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదో ఒక ప్రాంతాన్ని బుజ్జగించేందుకు ఏ చిన్న ప్రకటన వెలువడినా, అది రెండో ప్రాంతంలో నిరసనల్ని పెంచే ప్రమాదముంది. ఇది చాలా సున్నితమైన పరిస్థితి. ఇదే ధోరణి కొనసాగితే, సెప్టెంబర్‌ 6న రావాల్సిన రామ్‌చరణ్‌ తుఫాన్‌ విడుదల మీద కూడా ప్రభావం చూపించవచ్చు. అంతే కాదు ఇతరత్రా పెద్ద చిత్రాలేవీ వెండి తెర మీద సందడి చేసే పరిస్థితులు ఉండకపోవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, హిందీ చిత్ర నిర్మాతలు దాదాపు 6 నెలల ముందే డేట్లు, థియేటర్లతో సహా అన్ని నిర్ధారించుకొని ఉంటారు కాబట్టి, వెనక్కి వెళ్ళకపోవచ్చు. రాష్ట్రంలో పరిస్థితులతో సంబంధం లేకుండా తుఫాన్ సెప్టెంబర్‌ 6నే వచ్చేయాలి. అప్పటికీ ఉద్యమ ప్రభావం ఉంటే, ఆ చిత్రాన్ని కొనుగోలు చేసినవారిపై ఆ దెబ్బ పడే ముప్పు పొంచి ఉందని అంటున్నారు.

టాలీవుడ్‌కు 350 కోట్ల నష్టం
రోజువారీ సమస్యల నుంచి విరామం కోసం వెండి తెర కాల్పనికతను ఆశ్రయించే సగటు సినీ ప్రియులకూ, అలాగే ఆయా హీరోల అభిమానులకూ మాత్రం ఈ మొత్తం పరిణామాలు నిరాశ కలిగిస్తున్నాయి. సినిమా చూసి సేద తీరదామంటే, వీలు లేకుండా పోయింది. అభిమాన హీరోల చిత్రాలు విడుదల కాకపోవడంతో ప్రస్తుతానికి షారుఖ్‌ ఖాన్‌ చెన్నై ఎక్స్‌ప్రెస్ లాంటి హిందీ చిత్రాలు, ఇంగ్లీషు చిత్రాలు, కొన్ని డబ్బింగ్ చిత్రాలను చూడాల్సి వస్తోంది. పెద్ద హీరోల చిత్రాలు నిలిచిపోవడంతో తెలుగు చిత్రపరిశ్రమకు దాదాపు 350 కోట్ల రూపాయల నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పెద్ద చిత్రాలకు అయిన బడ్జెట్ కూడా ఎక్కువే. ఆ చిత్రాలు విడుదలైతే తొలి వారం కలెక్షన్లతో నిర్మాతల్లో ఉత్సాహం నిండేది. కానీ, విడుదల ఆగిపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఓపెనింగ్ కలెక్షన్లే ప్రధాన రక్షగా నడుస్తున్న రోజుల్లో సినిమా అత్యధిక ధియేటర్లలో విడుదల అవుతుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెనింగ్ కలెక్షన్లపై ఉద్యమ ప్రభావం పడితే సినిమాకు నష్టాలు తప్పవు. రాబోయే సినిమాలకు ఉద్యమానికి సంబంధం లేకపోయినా మెగా ఫ్యామిలీ సినిమాలపై చిరంజీవి, నందమూరి కుటుంబాల సినిమాలపై చంద్రబాబు ప్రభావం తప్పక పడనుంది. అందుకే అగ్రహీరో సినిమాలు రాష్ట్ర పరిస్థితులు చక్కబడేంత వరకూ విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు. అయితే, సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నందున అక్కడ జనాలు వస్తారో రారో అన్న దాంతో రిలీజ్ కు వెనుకంజ వేస్తున్నారు. రాజకీయ నేపథ్యం లేని అగ్రహీరోల చిత్రాలు ఈ కారణంగా వాయిదా పడుతున్నాయి. అంత వరకూ నిర్మాతలు విడుదల తేదీలు ఖరారు చేసుకునేంత మేర ఏదోరకంగా తమ సినిమాలను పబ్లిసిటీ చేసుకుంటూ కాలం వెళ్లదీయక తప్పదు.

సినిమా నిర్మాణం పూర్తయి చాలా కాలం అయినా విడుదల కాకపోవడంతో నిర్మాతలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఈ విధంగా సినిమా విడుదల వాయిదా పడుతుండటంతో, తరువాత విడుదల కావలసిన సినిమాలు కూడా వాయిదా పడడం ఖాయం. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న సినిమాలపై కూడా ఈ ప్రభావం పడుతోంది. ప్రస్తుత రాజకీయ అనిశ్చితి ఇప్పుడిప్పుడే అంతం అయ్యే సూచనలు కనబడకపోవడంతో చిన్న, పెద్ద సినీ నిర్మాతలు తమ కొత్త సినిమాల నిర్మాణం వాయిదా వేసుకొంటున్నారు. అంతిమంగా ఈ ప్రభావం సినీ రంగంపై ఆధారపడి బతుకుతున్న వేలాది మంది జీవితాలపై పడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక చిన్న సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలుగా, గోడౌన్లుగా మారిపోయాయి. చాలా థియేటర్లకు ఇదే గతి పట్టవచ్చు.

కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రేయనక పగలనక కష్టపడి నిర్మించిన సినిమాలు విడుదల కాని పరిస్థితులు ఉంటే నిర్మాతలు సినిమా నిర్మించే సాహసం చేయరు. ప్రజలకు వినోదం పంచిపెట్టే సినీ పరిశ్రమ నేడు పెను విషాదం చవి చూస్తోంది. మళ్లీ మన టాలీవుడ్ కు మంచి రోజులు వస్తాయని సగటు సినీ ప్రేక్షకుడు ఎదురుచూస్తున్నాడు.