తుఫాన్ బాధితులకు విరాళాలు రాకపోవడానికి కారణం మీడియానే !

Thursday, October 18th, 2018, 11:55:47 AM IST

గత కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీవీ ఛానెళ్లు నైతిక భాద్యతను పూర్తిగా మరిచి వ్యవహరిస్తున్నాయి. ముఖ్యమైన, ప్రజాదరణ ఎక్కువగా ఉన్న తెలుగు న్యూస్ ఛానెళ్లు ఇవ్వాల్సిన వాటికి కవరేజ్ ఇవ్వకుండా టీఆర్ఫీ రేటింగ్స్ కోసం అనవసరమైన వాటికి అతిగా స్పందించే మాయ రోగాన్ని ఇంకా తగ్గించుకోలేదు. తిత్లీ తుఫాను మరీ భయంకరమైనది కాకపోయినా చాలా నష్టాన్నే కలుగజేసింది. దీనికి మీడియా ఇచ్చిన కవరేజ్ చాలా తక్కువ.

ఎంతంటే ప్రజల్లో చాలా మందికి తుఫాన్ నష్టం ఎంత, సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి, మన లీడర్ల పనితనం ఎలా ఉంది, ఎక్కడెక్కడ అత్యవసర సహాయక చర్యలు అవసరం వంటి వివరాలు చాలా వరకు తెలియవు. కానీ కత్తి మహేష్, శ్రీ రెడ్డిల వ్యవహారం, ప్రణయ్ పరువు హత్య వంటి ఘటనల్లో ఇంచు ఇంచు మనోళ్లకి చాలా బాగా తెలుసు. నిద్రలో లేపి అడిగినా వాటిపై అనర్గళంగా మాట్లాడేంత. దీనికి కారణం టీఆర్ఫీ రేటింగ్స్ కోసం ఆ విషయాలకు అదనపు ఉద్రిక్తతతను జోడించి, చిన్న పెద్ద, ఆడ మగ అనే తేడా లేకుండా మేధావుల్ని, సంఘ సంస్కర్తల్ని లైవ్ షోల్లో కూర్చో బెట్టి 24 గంటలు డిబేట్లు పెట్టి వాటిని ప్రజల మెదళ్లలోకి కుక్కిన మీడియానే.

అంతగా అవసరంలేని ఇలాంటి విషయాల్ని హైలెట్ చేసే ఛానెళ్లు తుఫాన్ కు మొక్కుబడి కవరేజ్ ఇచ్చింది తప్ప పెద్దగా ప్రోగ్రామ్స్ చేయలేదు. తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాలకు వెళ్లి, బాధితులతో మాట్లాడి అక్కడి పరిస్థితుల్ని, కలిగిన నష్టాన్ని, జనల కన్నీళ్లను చూపించలేదు. కనీసం సంబంధిత అధికారులు, నేతలతో సైతం మాట్లాడించలేదు. మేధావుల్ని, నిపుణుల్ని పిలిచి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ కష్టాన్ని త్వరగా అధిగమించవచ్చు, భవిష్యత్తులో విపత్తుల్ని మరింత విజయవంతంగా ఎదుర్కోవాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వంటి చర్చా కార్యక్రమాలు పెట్టలేదు. అందుకే సమస్య తీవ్రత ప్రపంచానికి తెలీక కేంద్రం నుండి సహాయక నిధులు, బయటి జనం నుండి విరాళాలు అందాల్సిన స్థాయిలో అందలేదు. ఇది కహెచ్చితంగా మీడియా వైఫల్యమే. దీన్నిబట్టి మన ఛానెళ్లకు టీఆర్ఫీల దాహం తప్ప సామాజిక భాద్యత పెద్దగా లేదని అర్థమవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments