అక్కడంతే.. 61 మంది చనిపోయినా కేసులుండవు !

Sunday, October 21st, 2018, 02:50:37 PM IST

నిన్న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో జరిగిన రైలు ప్రమాదంలో 61 మంది చనిపోయిన దుర్ఘటన మొత్తం దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలీస్ శాఖ త్వరిత గతిన విచారణ జరిపి, భాద్యుల్ని కనిపెడుతుందని అందరూ ఆశించారు. కానీ ఈ ప్రమాదం విషయంలో ఇప్పటికీ ఒక్క కేసు కూడ నమోదుకాకపోవడం, పోలీసులు ఎవరి పేర్లనూ ప్రస్తావించకపోవడం పంజాబ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ రీతిలో పనిచేస్తుందో అద్దంపడుతోంది.

ఇప్పటికే రైల్వే శాఖ ప్రమాదంలో తమ తప్పిదం ఏమీ లేదని చేతులు దులుపుకోగా అధికార కాంగ్రెస్ నేతలు కొందరు జనాన్ని పట్టాలపై మేము నిలబడమన్నామా, రైలుని మేము గుద్దమని చెప్పామా అంటూ తన నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేశారు. కనీసం ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కూడ ఈ ప్రమాదంపై గట్టిగా స్పందించలేదు. ఈ ప్రమాదానికి మూల కారణం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, స్థానిక అధికారులకు, రైల్వే శాఖకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు సతీమణి నవజ్యోత్‌ కౌర్‌ సిద్దు కావడమే ప్రభుత్వంలోని అలసత్వానికి కారణమని గట్టి వాదన వినిపిస్తోంది.

ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్, బీజేపీలు కూడ ఇదే విషయాన్ని బల్లగుద్ది చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రమాదానికి కారణమైన తమ పార్టీ సన్నిహితుల్ని కాపాడటానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments