వివేకా హత్య కేసులో పురోగతి ఏది ?

Thursday, May 16th, 2019, 08:02:16 AM IST

మాజీ మంత్రి, వైఎస్ జగన్ యొక్క కుటుంబ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. విచారణ మొదలై ఇన్నిరోజులు కావొస్తున్నా అసలు నిందితులెవరో తేల్చలేకున్నారు పోలీసులు. మొదట కేసును టేకప్ చేసిన ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు చేయగా ఆయన బదిలీ అనంతరం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అభిషేక్‌ మహంతి ప్రస్తుతం 11 బృందాలను నియమించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పటి వరకు తిరిగిన దర్యాప్తులో వివేకాను ఉద్దేశ్యపూర్వకంగానే అతి కిరాతకంగా హింసించి చంపినట్టు, చంపింది బెంగుళూరుకు చెందిన కిరాయి హంతకుల ముఠా అని పోలీసులు నిర్థారణకు వచ్చారట. పైగా మొదట్లో ఈ హత్యను భూ సెటిల్మెంట్లు, వివాహేతర సంబంధాల కోణంలో విచారించిన పోలీసులు హత్యకు కుటుంబ సమస్యలే కారణమని అనుమానిస్తున్నారు. ఇక దర్యాప్తు నత్త నడకన సాగడానికి కారణం తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లేనని తెలుస్తోంది.

మొదట్ల సాక్ష్యాలు మాయం చేయడానికి ట్రై చేసిన ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు ప్రస్తుతం కొందరిని అనుమానితులుగా గుర్తించి వారి కాల్ డేటాను నిపుణుల సాయంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా కిరాయి హంతకుల్ని పట్టుకుంటే అసలు నిందితులెవరో తేలిపోతుందని పోలీస్ శాఖ భావిస్తోంది.