ఐపీఎల్‌లో చీర్ గర్ల్స్ ఔట్..!

Tuesday, June 11th, 2013, 05:00:10 PM IST


ఐపీఎల్ పేరు వినగానే.. కామన్ గా చీర్ గాల్స్ చిందులే గుర్తుకొస్తాయి.. క్రికెట్ కు మసాల దట్టించే ఉద్దేశ్యంతో చీర్ గాల్స్ ను ఆటలోకి దింపారు. ఐతే వీళ్లు ఆటపాటలతో పాటు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఆ తర్వాత అంతా లైట్ తీసుకున్నారు. ఐతే రీసెంట్ గా ఐపీఎల్ లో పడగ విప్పిన స్పాట్ ఫిక్సింగ్ భూతం చీర్ గాల్స్ ను మింగేసింది. క్రికెట్ ను ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించిన బీసీసీఐ ఇకపై ఐపీఎల్ లో చీర్ గాల్స్ ఉండరని స్పష్టం చేసింది.

ఐపీఎల్‌లో వరస వివాదాలతో విసిగిపోయిన బీసీసీఐ పెద్దలు కఠిన నిర్ణయాలకు సిద్ధమయ్యారు. ఐపీఎల్‌ ప్రక్షాళనకు తాత్కాలిక అధ్యక్షడు జగ్మోహన్‌ దాల్మియా ఆధ్వర్యంలో బీసీసీఐ నడుం బిగించింది. ప్రధానంగా ఐపీఎల్‌లో అవినీతిని దూరం చేయడంపైనే ఎక్కువగా దృష్టిసారించారు. ఐపీఎల్‌ ప్రక్షాళన కోసం 12 పాయింట్ల ఫార్ములాను రూపొందించారు. ఇందులో ప్రధానమైనది.. ఇక నుంచీ ఐపీఎల్‌లో చీర్‌ గర్ల్స్ ను తొలగించాలని, మ్యాచ్‌ అనంతరం పార్టీలపై నిషేధం విధించాలని జగ్ మోహన్ దాల్మియా ప్రతిపాదించారు.

ఆ మెరుపులు ఉండవు..
పొట్టి పొట్టి డ్రెస్సులు.. కైపెక్కించే చూపులు.. అదిరిపోయే డ్యాన్సులతో ఫారిన్ భామలు క్రికెట్ లవర్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చారు. 2008లో ఐపీఎల్ మొదలైనప్పటి నుంచీ చీర్ గాల్స్ స్టేడియంలో సందడి చేయడం మొదలుపెట్టారు. బ్యాట్స్ మెన్ ఫో ర్ కొట్టినా.. సిక్సర్ కొట్టినా.. బౌలర్ వికెట్ తీసినా చీర్ గాల్స్ చిందులు మొదలవుతాయి. మంచి బీటున్న మ్యూజిక్ కు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తారు.

ఐపీఎల్ మొదటి సీజన్ లో చీర్ లీడర్స్ ఓ మోస్తరుగా ఆకట్టుకున్నా.. ఆ తర్వాత వీళ్లకు యమ క్రేజ్ పెరిగింది. చీర్ గాల్స్ తో కలిసి చిందులేసేందుకు ఆటగాళ్లు సైతం పోటీ పడ్డారు. ఒక్కో జట్టు అందమైన విదేశీ భామలను ఇంపోర్ట్ చేసుకుంది. ఆటగాళ్ల ఎంపికలో పోటీపడ్డ ఫ్రాంచైజీలు అందాల భామలను సెలక్ట్ చేసుకోవడంలోనూ ఏమాత్రం తగ్గలేదు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా.. ఇలా ప్రపంచంలోని అందాలన్నింటిని ఐపీఎల్ ముంగిట ఉంచారు మన ఫ్రాంచైజీలు.

ఇక నైట్ పార్టీస్ లో చీర్ లీడర్స్ తో కలిసి ఆటగాళ్లు బాగా ఎంజాయ్ చేశారు. ఒకానొక దశలో చీర్ గాల్స్ కు రెమ్యునరేషన్ కంటే నైట్ పార్టీల్లోనే ఎక్కువగా గిట్టుబాటవుతోందన్న వార్తలు పుట్టుకొచ్చాయి. పాశ్చాత్య సంస్కృతి భారత క్రికెట్ ను పాడు చేస్తోందంటూ పలు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఐతే ఆ విమర్శలు వాదనలు కేవలం ఒక సీజన్ కే పరిమితమయ్యాయి. ఆ తర్వాత చీర్ గాల్స్ తమ పని తాము చేసుకుపోయారు.

చీర్ గాల్స్ వల్ల ఐపీఎల్ కు వచ్చిన నష్టమేంటీ?
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కు.. చీర్ గాల్స్ కు ఏమైనా లింకు ఉందా? బీసీసీఐ వర్కింగ్ కమిటీ చీఫ్ జగ్మోహన్ దాల్మియా తీసుకున్న నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చీర్ గాల్స్ విషయంలో బీసీసీఐ నిర్ణయాన్ని క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటకు వీళ్లే అందమని.. వీళ్లుంటే ఆటకు వచ్చిన మచ్చ ఏమీ లేదంటున్నారు.

గ్రౌండ్ లో డ్యాన్స్ వేయడం తప్ప చీర్ గాల్స్ ఇంకేం చేస్తారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వీళ్లు తమ అందచందాలతో.. డిఫరెంట్ స్టెప్పులతో అదరగొడుతున్నారు. మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా.. ఓడినా ఫ్యాన్స్ మాత్రం చీర్ గాల్స్ చిందులతో రీ ఫ్రెష్ అవుతున్నారు. ఐపీఎల్ లో ఒక్కో జట్టు ఫ్రాంచైజీ 15 మంది చీర్ గాల్స్ ను ఆటలోకి దింపుతోంది. అంటే మొత్తం 8 జట్లలో కలిపి సుమారు 120 మంది విదేశీ బ్యూటీలు కొంత రెమ్యునరేషన్ తీసుకుని చిందులేస్తున్నారు. బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల వీళ్లందరు ఉపాధి కోల్పోనున్నారు. ఐతే ఐపీఎల్ ను వీళ్లు పార్ట్ టైంగా ఎంచుకున్నారు కనుక పెద్దగా ప్రాబ్లమేమీ ఉండదు. ఐతే గత ఆరు సీజన్లుగా క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించిన చీర్ గాల్స్ ప్రస్థానం ముగిసినట్టే.

ఆటలో చీర్ గాల్స్ లేకపోతే మజా ఉంటుందా? ఇన్నాళ్లు ఫారిన్ బ్యాటీల స్టెప్పులకు మైమరిచిపోయిన ఆడియన్స్.. ఇకపై ఐపీఎల్ ను చూసేందుకు ఇంట్రస్ట్ చూపుతారా అనేది ప్రశ్నగా మారింది.