ఇక్కడ టీడీపీని ఎవరూ బలహీనపరచలేరు!

Thursday, May 24th, 2018, 08:35:55 AM IST

ప్రస్తుతం తెలంగాణాలో టిడిపి ప్రాభవం పూర్తిగా తగ్గిపోయిందని, అంతేకాక పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేస్తే మంచిదని కొన్నాళ్ల క్రితం టిటిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే సృష్టించాయి. కాగా నిన్న టీడీపీ నేతలు నిర్వహించిన మినీమహానాడు ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపిందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. నిన్న కరీంనగర్ మండలం రేకుర్తి గ్రామంలో టిడిపి మినీ మహానాడు అక్కడి స్థానిక అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్యమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు నేతలు ర్యాలీ నిర్వహించి టీడీపీ జెండాను ఎగురవేశారు. అంతేకాక ఇటీవల చనిపోయిన టీడీపీ నేతలకు కొద్దిసేపు మౌనం వహించి సభను ప్రారంభించారు. కాగా సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టీపీడీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణాలో టిఆర్ ఎస్ నేతలు కార్యకర్తలు ప్రజా ధనాన్ని అందినంత దోచుకుని లూఠీ చేస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మాత్రం ప్రజా పాలన మీద దృష్టిపెట్టడం లేదని విమర్శించారు.

అలానే టిఆర్ ఎస్ పాలనలో కొరవడిన సామజిక న్యాయం, విద్య, యువతకు ఉద్యోగాలు, సాగునీటి ప్రాజక్టులు, అస్తవ్యస్త పాలన, జర్నలిస్టుల సంక్షేమం, బడ్జెట్ కేటాయింపులు తదితర అంశాల పై టిఆర్ ఎస్ ఎటువంటి శ్రద్ధ తీసుకోవడంలేదని వారు సమావేశంలో ఈ తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. తెలంగాణలో టిడిపి పని అయిపోయిదని చెప్పడం కొందరి అవివేకానికి నిదర్శనమని పెద్ది రెడ్డి అన్నారు. అసలు టిడిపిని బలహీన పరచడం ఎవరితరం కాదని, టీడీపీ ఒక ఊట బావి లాటిదని, ఈ పార్టీనుండి ఎందరో గొప్ప గొప్ప నేతలు వచ్చి వెళ్లారని, అయినప్పటికి పార్టీకి ఎప్పుడూ కూడా కార్యకర్తల బలం ఉంటుందని అన్నారు. కేసీఆర్ తమ పార్టీనేతలను ప్రలోభాలతో మభ్యపెట్టి తమవైపుకు తిప్పుకుంటున్నారని విమర్శించారు.

అయినా రానున్న ఎన్నికల్లో తమ సహకారంతోనే ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందని, తమ పార్టీపై ప్రజలకు ఎప్పటికి నమ్మకం ఉంటుందని చెప్పారు. టిఆర్ ఎస్ నియంతృత్వ విధానాలవల్ల ప్రజలు విసిగిపోయి వున్నారని, రానున్న ఎన్నికల్లో టిఆర్ ఎస్ కు మొత్తంగా 61 స్థానాలకు మించి రావని వారి పార్టీ నేతలే కొందరు బహిరంగంగా చెపుతున్నారని అన్నారు. నిజానికి ఆ పార్టీకి ఒంటరిగా పోటీచేస్తే ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ కూడా రాదని విమర్శించారు. రానున్న గ్రామపంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటి, ఆ గెలుపుతో రాబోయే 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీ తప్పక సాధిస్తామని చెప్పారు. త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి పార్టీ కార్యకలాపాలపై పూర్తిగా దృష్టి పెట్టె విధంగా అన్నిచర్యలు తీసుకున్నట్లు, ఆ విధంగా తగు ప్రణాళికలు కూడా రచిస్తున్నట్లు పెద్ది రెడ్డి తెలిపారు……

  •  
  •  
  •  
  •  

Comments