ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత!

Monday, May 21st, 2018, 11:43:10 AM IST

ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి నిన్న రాత్రి పరమపదించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో తన కుమార్తె నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె నవలలు అత్యధికంగా అచ్చు వేసిన ఎమ్యెస్కో పబ్లిషర్స్ అధినేత విజయ్ కుమార్ ఆమె మరణ వార్తను ధ్రువీకరించారు. సులోచన రాణి మృతి విషయాన్నీ ఆమె కుమార్తె శైలజ నిన్న రాత్రి ఆయనకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపారు. 1970వ దశకంలో నవలా ప్రపంచంలో ఒక కలికితురాయి యద్దనపూడి సులోచన రాణి. అప్పటి యువతుల మనోభావాలకు దగ్గరగా ఉండేవి సులోచనారాణి రచనలు. అంతే కాదు ఆమె ఎక్కువగా పేదింటి అమ్మాయి, ధనిక అబ్బాయి మధ్య ప్రేమ చిగురించే అంశంతో ఎక్కువగా నవలలు రాసే వారు.

ఆమె రచనల్లో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఒక అద్భుతంగా నిలిచేది సెక్రెటరీ నవల అని చెప్పాలి. ఆ నవలకు ఒకప్పుడు ప్రజలు అమితంగా ఇష్టపడి చదివేవారు. ఆ తరువాత అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ ప్రధానపాత్రల్లో ఆ నవల అదే పేరుతో సినిమా గా తెరకెక్కి అద్భుత విజయం అందుకుంది. మారుతున్న ప్రజా జీవితాన్నిబట్టి అప్పటి పరిస్థితులకు తగ్గట్లు ఆమె రచనలు ఉండేవి. ఆత్మభిమానం, వ్యక్తిత్వం, ప్రేమ, కోపం వంటి భావజాలాలు ఆమె నవలల్లో ఎక్కువగా కనిపించేవి. అంతే కాదు ఆమె నవలల్లోని పాత్రలు ఒక్క క్షణంలో ఆనందం, వెనువెంటే దుఃఖం వచ్చేలా ప్రవర్తించేవి. ముఖ్యంగా మద్యతరగతి అమ్మాయిల మనోగతం, వారి ఆశలు, కోరికలు, మనస్తత్వం, ఆలోచనలు, జీవన విధానంపై ఆమె రచనలు చేసేవారు. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, సెక్రెటరీ, మీనా, అమర హృదయం, ఆశల శిఖరాలు, కలల కౌగిలి, గిరిజ కళ్యాణం తదితర 40 రకాల రచనలు ఆమె చేసారు.

ఆమె నవల వర్ణనలు కూడా అద్భుతమని చెప్పాలి, అప్పటి ఇల్లు, పరిసరాలు, వాతావరణం ప్రస్ఫుటించేలా ఆమె రచనలు సాగేవి. కాగా అక్కినేని, సావిత్రి, కృష్ణకుమారి ప్రధాన పాత్రలలో నటించిన చదువుకున్న అమ్మాయిలు ద్వారా ఆమె చిత్ర రంగంలోకి ప్రవేశించారు. తరువాత 1965లో మనుషులు-మమతలు చిత్రానికి కథను అందించారు. జీవన తరంగాలు, రాధా కృష్ణ, మీనా, అగ్నిపూలు, చండి ప్రియా, విచిత్ర బంధం వంటి చిత్రాలకు కథలు అందించారు. కాగా ఆమె రచించిన మీనా నవలకు పేరును పాఠకులే నిర్ణయించారు. తరువాత ఆ నవల విజయ నిర్మల, కృష్ణ ప్రధాన పాత్రల్లో సినిమాగా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆమె మృతికి పలువురు కవులు, రచయితలు, ప్రముఖులు తమవంతుగా ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments