ఇప్పుడు అంతా అల్ రైట్ అంటున్న జేసి!

Monday, July 23rd, 2018, 08:05:16 PM IST

కొన్నాళ్ల నుండి అలకబూనిన అనంతపురం ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ఏది చెప్పినా, చేసినా ముక్కుసూటిగా చేస్తూ వుంటారు. అయితే అందువల్ల ఆయన చిన్న చిన్న సమస్యల్లో కూడా ఇరుక్కోవడం జరిగింది. అయినప్పటికీ ఏది కూడా దాచుకోకుండా కుండా బద్దలు కొట్టినట్లు మాట్లాడడం తనకు అలవాటని అయన పదే పదే చెపుతుంటారు. ఇక నేడు చంద్రబాబు నాయుడుని ఏపీ సచివాలయంలో కలుసుకుని, ఆనందంతో బయటకి వచ్చి మీడియాతో మాట్లాడారు. చాలా రోజులనుండి తనపై వస్తున్న పుకార్ల గురించి స్పందించిన ఆయన, వాస్తవానికి తాను ఎవరిమీద అలగలేదని, అలా అలగడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు అని, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎవరి మీద అలకలు పెట్టుకోలేమని అన్నారు.

అయితే తాను చంద్రబాబుతో అంతా మనసువిప్పి మాట్లాడడానని, ప్రస్తుతం మనసు కాస్త ప్రశాంతంగా వుందని అన్నారు. తాను ఆయనతో ఏమి మాట్లాడాడింది, మీడియాకి మాత్రం చెప్పనంటే చెప్పనని అన్నారు. తాను ఎవరిమీదనో అలిగి పార్లమెంట్ కు వెళ్లలేదనేవి వొట్టి పుకార్లేనని, తనకు అటువంటి అవసరం లేదని అన్నారు. అయితే ప్రస్తుతం రాజకీయ వాతావరణం కొంచెం బాగోలేదని, రాజకీయాల్లో వున్నపుడు ఎవరికి కూడా అతివృష్టి, అనావృష్టి ఉండకూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని, రాష్ట్రానికి ప్రత్యేక హోదావిషయమై బీజేపీ చేసిన అన్యాయంపై తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ చెప్తున్నవి అన్ని కూడా వొట్టి అబద్ధాలని, అధికారంలో వుండి రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్, అప్పుడు ఏమి చేయలేదు, ఇప్పుడేమో అధికారం ఇస్తే ఆంధ్రకు హోదా ఇస్తామనడం హాస్యాస్పదమని అన్నారు. ఇక ఎన్డీయే నుండి బయటకు వచ్చి చంద్రబాబు మంచి పని చేసారని, మేము ఎంతమొత్తుకున్నా కూడా మోడీ మాత్రం హోదా ఇవ్వరని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. అయినప్పటికీ తమ ఉద్యమాన్ని మాత్రం మరింత తీవ్రతరం చేసే తీరుతామని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments