ఆ నోట్లు ఇక చిత్తు కాగితాలేనా…ప్రజలు ఇప్పుడు ఏం చేయాలంటే…!!

Wednesday, November 9th, 2016, 08:32:32 AM IST

modi500n1000
నల్లధనం నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. మంగళవారం అర్థరాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నోట్లు కేవలం కాగితాలు మాత్రమే ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కరెన్సీ నోట్లు ఉన్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. ఈ నోట్లు కలిగిన ప్రజలు రానున్న రోజుల్లో ఏం చేయాలంటే.. నేడు రేపు బ్యాంకులు పనిచేయబోవు. ప్రస్తుతం మీవద్ద ఉన్న రూ. 500, రూ. వెయ్యినోట్లను డిసెంబర్‌ 30, 2016లోపు బ్యాంకులు, పోస్టాఫీసులలో డిపాజిట్‌ చేయవచ్చు.

ఇలా డిపాజిట్‌ చేసే నగదు విషయంలో ఎలాంటి పరిమితి లేదు. ఈ నెల 24 వరకు హేడ్‌ పోస్టాఫీస్‌ లేదా సబ్‌ పోస్టాఫీస్‌లలో గుర్తింపు కార్డు చూపించి పాత రూ. 500, రూ. వెయ్యినోట్లను బదిలీ చేసుకోవచ్చు. ఇక్కడ రూ. 4,000 పరిమితి ఉంటుంది. చెక్కులు, డిమాండ్‌ డ్రాఫ్ట్స్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపుల విషయంలో, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ విషయంలో ఎలాంటి పరిమితులు ఉండబోవు. ప్రస్తుతం బ్యాంకు నుంచి ఉపసంహరించే నగదు విషయంలో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 20వేలు వరకు పరిమితి ఉంటుంది. దీనిని రానున్న రోజుల్లో పెంచవచ్చు.