ఇక మా దృష్టి తెలుగు రాష్ట్రాల పైనే : బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్

Sunday, May 27th, 2018, 11:24:02 AM IST

ఎన్డీయే ప్రభుత్వం తమ పాలనలో నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిన్న గుంటూరులోని సిద్దార్ధ గార్డెన్స్ లో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. పలువురు బిజెపి నాయకులు ఈ సభలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. కాగా ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ మాట్లాడుతూ, దేశంలో మేము పాలన చేపట్టిన ఈ నాలుగేళ్లలో ప్రజలు మరింత అభివృద్ధి పథంలోకి వెళ్లారని, ప్రజలందరుకూడా మరొక్కమారు మోడీని ప్రధానిగా చూడాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల విజయంతో ఉత్తరాది ప్రజలు తమకు బాగా చేరువయ్యారని, ఇక తమ దృష్టి మొత్తం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలపై పెడుతున్నట్లు ఆయన తెలిపారు. నిజానికి తమ పార్టీ ని అణగదొక్కేందుకు అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ ఒక అనైతిక పొత్తు పెట్టుకున్నాయని అన్నారు. తమ హవా కొనసాగుతున్నందునే తెలుగు రాష్ట్రాల నేతలు కొందరు కోల్కతా, కొందరు ఢిల్లీ బాట పట్టి ఫ్రంట్ ల పేరుతో హడావుడి చేస్తున్నారని అన్నారు.

2014 వలే రానున్న 2019 ఎన్నికల్లో కూడా అద్భుత విజయం సాధించి 2020కల్లా మోడీ దేశాన్ని ప్రగతి పధంలో ముందుకు తీసుకెళతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుండి మీరట్ కు 95 కిలోమీటర్లు వెళ్లే మార్గం కేవలం 40 నిమిషాల్లో చేరుకోవచ్చని, అదే బేగంపేట్ నుండి మారియట్ హోటల్ కు వెళ్ళడానికి 40 నిమిషాలకుపైనే పడుతుందని, ఈ విధంగా ట్రాఫిక్ సమస్యనే పరిష్కరించలేని వారు ఇంకా రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని విమర్శించారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధికి అడ్డంకిగా మారారని, ఇప్పటికే విభజన హామీలలో దాదాపు 85శాతానికి పైగా కేంద్రం నెరవేర్చిందని అన్నారు.

సీమాంధ్ర స్కామాంధ్ర గా మారనంతవరకు కేంద్రం ఏపీకి సాయం చేయడానికి ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. ఏపీ, తెలంగాణల్లో ప్రజలు ప్రస్తుతం వున్న అధికార పార్టీలపై తీవ్ర అసంతృప్తితో వున్నారని, జాతీయ స్థాయిలో ప్రజల మద్దతు కూడగడుతున్న మా పార్టీ రానున్న ఎన్నికల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో తప్పక మంచి మెజారిటీ సాదిస్తుందని అయన అన్నారు. టీడీపీ అనవసరంగా ఎన్డీయే నుండి వైదొలిగి తప్పుచేసిందని, సూపర్ ఫాస్ట్ ఎక్ష్ప్రెస్స్ లా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నబిజెపి రైల్లోనుండి దూకి పాసెంజర్ రైలు ఎక్కుతున్నారని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనప్పటికీ రానున్న ఎన్నికలు దేశవ్యాప్తంగా తమ ప్రభావాన్ని, తమకు వచ్చే సీట్లను మరింతగా పెంచుతాయని ధీమా వ్యక్తం చేసారు…..

  •  
  •  
  •  
  •  

Comments