ఎన్నారైలు ఇక తెలంగాణా టూరిజం అంబాసిడర్లు

Wednesday, April 18th, 2018, 10:13:01 AM IST

తెలంగాణలో పర్యాటకరంగాన్ని విస్తృతం చేసేందుకు రాష్ట్ర టూరిజంశాఖ వినూత్న ప్రణాళికను సిద్ధంచేసింది. ప్రవాస తెలంగాణ వాసులను అంబాసిడర్ లుగా నియమించేందుకు పర్యాటకశాఖ కసరత్తు చేస్తున్నది. తెలంగాణ వచ్చేవరకు ఉద్యమంలో తమవంతు పాత్ర పోషించిన ఎన్నారైలకు గుర్తింపు వచ్చేలా.. ఈ అంబాసిడర్ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఈ ప్రణాళిక సిద్ధమైన తర్వాత తెలంగాణ టూరిజానికి అంబాసిడర్‌గా గుర్తింపు పొందాలనుకొనేవారు ఆన్‌లైన్‌లో తమ పేరును నమోదు చేసుకోవచ్చు. తెలంగాణ అంబాసిడర్లుగా గుర్తింపు పొందినవాళ్లు తాముంటున్న దేశాల్లోని పర్యాటకులను తెలంగాణలో పర్యటించేలా ప్రచారం చేయాల్సి ఉంటుంది. తమ తమ దేశాల్లో స్థానికంగా జరిగే ఉత్సవాలు, సమావేశాలు, గెట్‌టుగెదర్, పార్టీలు.. ఇలా అవకాశం ఉన్న ప్రతిచోటా తెలంగాణలో ఆలయాలు, చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు..ఇతర ఆకర్షణీయమైన అంశాలను ప్రచారం చేయాలి. ఇందుకోసం పర్యాటకానికి సంబంధించిన వాల్‌పోస్టర్లు, కరపత్రాలు, అల్బమ్‌లను టూరిజం శాఖ అందిస్తుంది. టూరిజం అంబాసిడర్లుగా ఉన్న ఎన్నారైలకు విదేశీ పర్యాటకులు రాష్ట్రంలో పర్యటించే షెడ్యూల్‌ను అనుసరించి రివార్డు పాయింట్లను.. అందుకు తగిన విలువను కేటాయిస్తారు.

ఈ పాయింట్ల విలువమేరకు వచ్చేమొత్తాన్ని ఆయా ఎన్నారైల సొంతగ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక, సంక్షేమ, సేవా కార్యక్రమాల నిర్వహణకు వారి తరుపున ఖర్చుపెడుతారు. తద్వారా వారికి మంచిపేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఎన్నారైలు అంబాసిడర్లుగా సేవలందించడం మొదలుపెడితే విదేశీ పర్యాటకులకు వారి వారి దేశాల నుంచే సేవలు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణలో లభించే వసతులు, సౌకర్యాలను అక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ అంబాసిడర్లయిన ఎన్నారైల ద్వారానే జరుగుతాయి కాబట్టి వారికి ప్రత్యేక రాయితీలు.. డిస్కౌంట్లు లభిస్తాయి. రాష్ర్టానికి విదేశీ పర్యాటకుల రాక పెరిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠమవుతుంది. ప్రస్తుతం ఏటా రెండున్నర లక్షల మంది విదేశీ పర్యాటకులు మన రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నారైల సాయంతో ఈ సంఖ్యను పది లక్షల వరకు పెంచగల్గితే.. ఒక్కొక్కరు సగటున రూ.50 వేలు ఖర్చు చేసినా ప్రభుత్వానికి రూ. ఐదువేల కోట్లు సమకూరుతుంది. మార్గదర్శకాల రూపకల్పన అనంతరం తెలుగువన్ డాట్‌కాం, తెలుగు రేడియో లాంటి ఆన్‌లైన్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారు.

  •  
  •  
  •  
  •  

Comments