పొలిటిక‌ల్ బ్లాస్టింగ్ మ్యాట‌ర్.. టీడీపీ త‌రుపున ప్ర‌చారం.. రంగంలోకి ఎన్టీఆర్, క‌ళ్యాణ్‌ రామ్‌..?

Thursday, November 15th, 2018, 07:00:55 PM IST

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రంజుగా సాగుతోంది. ఇక ముందుగా తెలంగాణ‌లో ఎన్నిక‌లు డిసెంబ‌ర్‌లో జ‌రుగ‌నుండ‌డంతో ఇక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం పెద్ద యుద్ధ‌మే త‌లపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ‌లో మ‌హాకూట‌మి ఏర్ప‌డిన త‌ర్వాత తెలంగాణ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలే మారిపోయాయి. అప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్‌కు మ‌రోసారి తిరుగులేద‌ని తేల్చేశాయి సర్వేలు. అయితే ఎప్పుడైతే మ‌హాకూట‌మిలో భాగంగా కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకున్నాక వార్ వ‌న్‌సైడ్ కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా వ‌చ్చిన స‌ర్వేలు కూడా టీఆర్ఎస్ వ‌ర్సెస్ మ‌హాకూట‌మి మ‌ధ్య బిగ్ ఫైట్ త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ పండితులు చెబుతున్నారు.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. తెలంగాణ‌లో ఇప్పుడు కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క వ‌ర్గం హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ కంచుకోట‌గా ఉన్న కూక‌ట్‌ప‌ల్లిలో ఎలాగైన విజ‌యం సాధించి, త‌న ఉనికిని చాటుకోవాల‌ని చంద్రబాబు త‌న‌దైన వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఈ క్ర‌మంలో నంద‌మూరి హ‌రికృష్ణ కూతురు సుహాసినిని బ‌రిలోకి దించ‌నున్నార‌ని రెండు మూడు రోజులుగా వార్తలు వ‌స్తున్నాయి. అయితే క‌ళ్యాణ్‌రామ్‌ను కూక‌ట్‌ప‌ల్లి నుండి బ‌రిలోకి దించాల‌ని భావించిన‌ చంద్ర‌బాబు, బాల‌కృష్ణ‌తో రాయ‌భారం పంపార‌ని, అయితే ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్న క‌ళ్యాణ్ త‌న‌కు రాజ‌కీయాల పై పెద్ద‌గా ఆశ‌క్తి లేద‌ని సున్నితంగా తిర‌స్క‌రించార‌ని వార్తలు వ‌చ్చాయి.

అయితే క‌ట్ చేస్తే సుహాసిని లైన్‌లోకి వ‌చ్చింది. కూక‌ట్ పల్లి నుండి టీడీపీ త‌రుపున సుహాసిని పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ శ్రేణులు కూడా లీకులు ఇస్తున్నారు. మ‌రి ఇదే నిజ‌మై సుహాసిని బ‌రిలోకి దిగితే.. ఆమె సోద‌రులు క‌ళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌లు ప్ర‌చారంలో పాల్గొంటారా.. ముఖ్యంగా ఎన్టీఆర్ గ‌తంలో జ‌రిగిన విష‌యాల‌ను ప‌క్క‌నబెట్టి త‌న సోద‌రి కోసం ప్ర‌చారం చేస్తారా.. ఇదే విష‌యం ఇప్పుడు రాజకీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగానే కూక‌ట్ ప‌ల్లిలో ఒక‌వైపు క‌మ్మ‌సామాజిక వ‌ర్గ ఓట‌ర్లు అధికంగా ఉన్నారు. మ‌రోవైపు కూక‌ట్ ప‌ల్లి ఎక్కువ‌గా సెటిల‌ర్స్‌తో నిండిపోయి ఉంది.. ఈ క్ర‌మంలో సుహ‌సిని బ‌రిలోకి దిగి, ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్‌లు ప్ర‌చారం చేస్తే టీడీపీ గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కే అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.