పక్క ప్లాన్ తోనే ఎన్టీఆర్ బయోపిక్..ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టాలనేదే బాబు ప్లానా..?

Wednesday, February 8th, 2017, 03:45:29 AM IST


ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాగా తీయాలనే ఆలోచన చలన చిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో ఉంది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. కాగా నందమూరి బాలకృష్ణ తాను ఎన్టీఆర్ బయోపిక్ ని తీయబోతున్నానంటూ హఠాత్తుగా ప్రకటన చేశారు. ఇన్నిరోజులుగా ఈ ఆలోచన లేని బాలయ్య ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు ? దీనివెనుక రాజకీయ వ్యూహముందా ? అంటే అటు సినీవర్గాల నుంచి ఇటు రాజకీయ వర్గాలనుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు ఆలోచన బాలకృష్ణ కు రాలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే ఎన్టీఆర్ జీవితచరిత్రని సినిమాగా తీయాలని బాలయ్యని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుని ప్రత్యర్థులు ఇప్పటికి సొంత మామకు వెన్నుపోటు పొడిచాడనే విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆ విమర్శలన్నింటికీ సరైన సమాధానం ఇవ్వడానికి ఇదే సరైన సమయం అని బాబు అభావిస్తున్నట్లు తెలుస్తోంది.

1995 సమయంలో తెలుగు దేశం పార్టీ నందమూరి తారక రామారావు చేతుల్లోనుంచి చంద్రబాబు చేతుల్లోకి వచ్చింది. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ ఘటన గురించి చద్రబాబు ఇప్పటికి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అధికారం కోసం మామకు వెన్ను పోటు పొడిచారని ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా దీనిపై తెలుగు దేశం పార్టీ నేతల వాదన వేరే విధంగా ఉంది. ఆ సమయంలో బాబు టిడిపి పగ్గాలు చేపట్టాక పొతే పార్టీ ఉండేది కాదని అంటున్నారు. ఈ అంశాన్నే బాబు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. తాను ఏ పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు చేపట్టవలసి వచ్చిందో ప్రజలకు వివరించాలంటే ఎన్టీఆర్ జీవిత చరిత్రని సినిమాగా మలచడమే ఉత్తమమని బాబు భావిస్తున్నారట. ఈ చిత్రం లో ఖచ్చితంగా ఎన్టీఆర్ పాత్రని హీరో గా చూపించాల్సిందే. అలాగే తన పాత్రని కూడా ఈ చిత్రంలో పాజిటివ్ గా ఉండేలా ఎన్టీఆర్ కు సమానంగా ఉండేలా తీర్చిదిద్దాలని బాబు బాలయ్యకు సూచించారట.తద్వారా కష్టకాలంలో పార్టీ పగ్గాలు చేపట్టి సమర్థవంతగా పార్టీ ని నడిపించాడనే భావనని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దీనితో తనపై విమర్శలు చేసేవారికి సమాధానం చెప్పొచ్చని, ప్రజల్లో సమర్థవంత మైన నాయకుడనే భావనని తెలుకెళ్లొచ్చని బాబు భావిస్తున్నాడట. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టే ప్లాన్ అన్నమాట. లక్ష్మి పార్వతి కూడా ఈ చిత్రం పై ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. చంద్రబాబు ని కూడా ఈ చిత్రంలో హీరోని చేసి చూపిస్తారనే వార్తలు రావడంతో ఆమె దీనిపై ఘాటుగా స్పందించింది. బాబుని హీరోని చేసి చూపిస్తే సహించేది లేదని తాను కోర్టుకు వెళ్లడానికైనా సిద్ధమని ఆమె హెచ్చరించింది. ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా చూపించాలని ఆమె డిమాండ్ చేస్తోంది.ఇప్పటినుంచే వివాదంగా మారిన ఈ చిత్రం ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే విడుదల వరకూ ఆగాల్సిందే.