మూవీ రివ్యూ : ‘యన్.టి.ఆర్’ కథానాయకుడు – ఆకట్టుకున్న బాలయ్య

Wednesday, January 9th, 2019, 07:27:52 PM IST

భారతీయ సినీ పరిశ్రమలో బయో పిక్ చిత్రాలకు అనూహ్యమైన స్పందన వస్తుంది.ఇప్పుడు అదే బాటలో మరో అద్భుతమైన బయో పిక్ ఒకటి కూడా తెరకెక్కింది,అదే ప్రతీ ఒక్క తెలుగు వాడు ఆప్యాయంగా “అన్న” గారు అని పిలిచుకున్న ఏకైక నటుడు “విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు” గారి యొక్క జీవిత చరిత్ర.ఆ దైవానికి రూపం అంటూ ఉంటే అది రామారావు గారిలానే ఉంటుందేమో అన్నంతగా ఆయన పాత్రల్లో ఒదిగిపోయారు.ఇప్పుడు ఆయన యొక్క జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రామారావు గారి యొక్క తనయుడు నందమూరి బాలకృష్ణే కథానాయకునిగా,పలువురు అగ్ర సినీ నటులు ముఖ్య పాత్రల్లో మెరిసిన, రామారావు గారి యొక్క జీవిత చరిత్రపై తీస్తున్న రెండు భాగాల్లో మొదటి భాగం “యన్.టి.ఆర్(కథానాయకుడు)” ఈ రోజే ఎప్పుడెప్పుడా అని ప్రతీ ఒక్క తెలుగువాడు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎన్నో అంచానాల నడుమ ఈ రోజే విడుదలయ్యింది.మరి ఈ చిత్రాన్ని క్రిష్ ఎంత వరకు చక్కగా తీర్చిదిద్దారో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి..

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే మొదలులోనే బాలకృష్ణ(నందమూరి తారక రామారావు) యొక్క జీవిత కథను తన కొడుకు కళ్యాణ్ రామ్(హరికృష్ణ) కు చెప్తూ విద్యా బాలన్(బసవ తారకం) మొదలు పెడతారు.రామారావు ఒక సాధారణ ఉద్యోగిగా కనిపిస్తారు.నటన మీద మక్కువ తో తన ఉద్యోగాన్ని వదిలేసి సినీ పరిశ్రమ వైపు అడుగేస్తారు.అలా వెళ్లిన రామారావుకి తన సినీ ప్రస్థానం ఆరంభంలో ఎదురైన ఇబ్బందులు ఏమిటి?వాటిని ఎన్టీఆర్ ఎలా దాటగలిగారు.అలా దాటి ప్రజల దృష్టిలో దేవునిలా కొలచగలిగే స్థాయికి ఎలా వెళ్లగలిగారు.కథానాయకునిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన రామారావు మహానాయకునిగా ఎలా మారారో తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ సినిమా ప్రారంభంలోనే ఈ సినిమాకి మరియు రామారావు గారి నిజ జీవితంకి సంబందించిన ముఖ్య పాత్రలు పరిచయం కాబడతాయి.తన సినీ ప్రస్థానంలో ఎదుర్కున్న రామారావు గారి పాత్రలో బాలకృష్ణ అద్భుత నటనను కనబరుస్తారు.అప్పటి మరో అగ్ర నటుడు అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో హీరో సుమంత్ కరెక్ట్ గా సెట్ అయ్యారు.ఎన్టీఆర్ మరియు ఎన్నార్ ల మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులకు వారినే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.ఇక మిగతా పాత్రలు మహానటి సావిత్రి పాత్రకి నిత్యా మీనన్ సరైన న్యాయం చేకూర్చుతారు.రేలంగి పాత్రలో బ్రహ్మానందం,కృష్ణ కుమారి పాత్రలో ప్రణీత ఇలా మొదటి సగం అంతా పాత్రలకే ఎక్కువ సమయం కేటాయించిన అనుభూతి అయితే ప్రేక్షకులకు కలుగుతుంది.దీనిపై క్రిష్ కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

ఎన్టీఆర్ యొక్క అన్ని పాత్రల్లో కన్నా ఆయనకు అమితంగా ఇష్టమైన పాత్ర రావణాసురుని పాత్ర.ఈ పాత్రలో బాలకృష్ణ నటనతో అభిమానులతో ఈలలు వేయిస్తారు.అలాగే మాయాబజార్ సినిమాలో కృష్ణుని యొక్క పాత్రలో బాలకృష్ణ కనబర్చిన నటనా తీరు,ఫస్టాఫ్ అంతటికి ప్రధాన ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు.భావోద్వేగ పూరిత కొన్ని సీన్లతో కలిగిన మొదటి సగం లో చివరి పది నిమిషాలు మినహా మిగతా అంతా సెకండాఫ్ లో అసలైన కథలోకి తీసుకెళ్లేలా సంకేతాలు వదులుతూ పరవాలేదనిపించే స్థాయిలో సాఫి గానే సాగుతుంది.

కొన్ని ఎలివేషన్ సీన్లు,హృదయానికి హత్తుకునే సీన్లతో ఫస్టాఫ్ పరవాలేదనిపించే రీతిలో ముగుస్తుంది.అలాగే జయప్రద పాత్రలో హన్సిక,వేటగాడు సినిమాలో శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ల యొక్క క్యామియో రోల్స్ లో వారి పాత్రలకు సరైన న్యాయం చేకూర్చారు.ఇలా మొదటి సగంలా సెకండాఫ్ లో కూడా పాత్రల పరిచయానికి క్రిష్ ఎక్కువ సమయం తీసుకున్నారా అనిపిస్తుంది.ఇక ఈ చిత్రానికి డైలాగ్స్ అందించిన సాయి మాధవ్ బుర్రా మాటల్లో కాస్త పదును తగ్గిందనే చెప్పాలి.

సందర్భానుసారం వచ్చే కొన్ని డైలాగులు అద్భుతంగా అనిపిస్తాయి.అలాగే ఈ చిత్రానికి సంగీతం ఇచ్చిన కీరవాణి పాటలు,బాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించారు.సెకండాఫ్ లో వచ్చే రాజకీయ ప్రస్థానానికి వచ్చే సన్నివేశాలు,చంద్రబాబు పాత్రలో రానా ఇలా పలు అంశాలు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతాయి.కాకపోతే సెకండాఫ్ మాత్రం కాస్త సాగదీతగా సాగినట్టు ప్రేక్షకునికి అనిపిస్తుంది.సినిమా చూస్తున్నంత సేపు ఏదో డ్రామా చూస్తున్న అనుభవమే ఎక్కువ కనిపిస్తుంది తప్ప అంత ఆసక్తికరంగా అయితే ఉండదు.ఈ విషయంలో మాత్రం క్రిష్ విఫలమయ్యారనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

బాలయ్య అద్భుత నటన.

ఎన్టీఆర్ మరియు ఎన్నార్ ల మధ్య సన్నివేశాలు.

విద్యా బాలన్ పాత్ర.

నిర్మాణ విలువలు.

క్లైమాక్స్.

మైనస్ పాయింట్స్ :

సినిమా కాస్త సాగదీతగా అనిపిస్తుంది.

ఎమోషనల్ సీన్లలో అంత కనెక్టివిటీ ఉండదు.

తీర్పు :

మొత్తానికి చూసుకున్నట్టయతే ఎన్నో అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాతో బాలకృష్ణ అద్భుత నటనను కనబర్చారు.దీనితో బాలయ్య యొక్క అభిమానులకు మాత్రం విపరీతంగా నచ్చుతుంది.కానీ ఎన్టీఆర్ యొక్క సినీ ప్రస్థానాన్ని క్రిష్ తెరకెక్కించిన తీరు కాస్త స్లో గా ఉండడంతో మిగతా ప్రేక్షకులు అయితే ఒకసారి చూసే అవకాశం ఉంది.

Rating : 3/5

REVIEW OVERVIEW
NTR Kathanayakudu Telugu Movie Review