అందులో ఎన్టీఆర్ పేరు లేదు

Tuesday, September 23rd, 2014, 11:42:10 AM IST

NTR
భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ‘పద్మ’ పురస్కారాలకు ప్రముఖుల పేర్లను ఎన్నిక చెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ కమిటీ సిఫార్సు చేసిన జాబితాలో ‘భారతరత్న’పురస్కారానికి దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పేరు లేదని కేంద్ర హోంశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అసలు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన జాబితాలో ‘భారతరత్న’ అవార్డుకు ప్రతిపాదనే లేదని వారు తేల్చి చెప్పారు.

ఇక కమిటీ సిఫార్సు చేసిన జాబితాలో ‘పద్మ విభూషణ్’ పురస్కారం కొరకు ఎంఎం నాయక్, నోరి దత్తాత్రేయ, బాపు, నాగేశ్వర్ రెడ్డి, రాజిరెడ్డి ఉన్నారు. అలాగే ‘పద్మ భూషణ్’ కొరకు చాగంటి కోటేశ్వరరావు, నేదునూరి కృష్ణమూర్తి, మురళీ మోహన్ ఉన్నారు. ఇక ‘పద్మశ్రీ’ కి మోహన్ కందా, సత్యవాణి, ఏ కన్యాకుమారి, కోట శ్రీనివాసరావు, గల్లా రామచంద్రనాయుడు, పసుమర్తి శర్మ, కార్టూనిస్ట్ శ్రీధర్, ఐ వెంకటరావులు ఉన్నట్లుగా తెలుస్తోంది.