సైడ్ క్యారెక్టర్ కాస్త హీరో అయిపోయాడు.. తమిళనాట మధ్యంతర ఎన్నికలు.?

Wednesday, February 8th, 2017, 08:40:41 AM IST


ఇక తమిళనాడు తరువాతి ముఖ్యమంత్రి శశికళ ఖాయం అనుకున్న తరుణంలో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగాయి. అర్థ రాత్రి సమయం లో జయ సమాధి వద్ద పన్నీర్ సెల్వం మీడియా ముఖంగా తనకు శశికళ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదని చెప్పడంతో అన్నా డీఎంకేలో కుదుపు మొదలైంది.దీనితో తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని, మధ్యంతర ఎన్నికలు కూడా జరగవచ్చని అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. అమ్మ తననే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుందని, ఆసుపత్రిలో ఉండగా పార్టీని నిలబెట్టితే భాద్యతని తనకు అప్పగించిందని పన్నీర్ మీడియాకు తెలపడంతో అన్నా డీఎంకే లో అగ్గి రాజేసుకుంది. కొద్ది రోజుల క్రితం అన్నా డీఎంకే పార్టీ సమావేశంలో తనని ముఖ్యమంత్రిగా ఉండాలని పన్నీర్ ఒత్తిడి చేసారని అందుకే తాను తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాని శశికళ ప్రకటించింది. ఇంతలోనే పన్ని ర్ శశికళ పై తిరుగుబాటు బావుటా ఎవగరవేసారు. శశికళ ముఖ్యమంత్రిగా ఈ పాటికే బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. కానీ కోర్టులో ఆమె అక్రమాస్తులపై సంబందించిన కేసులు ఉండడంతో గవర్నర్ విద్యాసాగర్ రావు కు తీర్పు వేచి వరకూ ఆగాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది.

దీనితో శశికళ ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. ఈ మధ్యలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది అన్నా డీఎంకే నేతలు శశికళ ని బహిరంగంగానే విమర్శించారు. శశికళను పార్టీ మెజారిటీ సభ్యుల మద్దత్తు ఉన్నా బయట మాత్రం ఆమెపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో పన్నీర్ అదును చూసి దెబ్బ కొట్టాడని విశ్లేషకులు అంటున్నారు. పన్నీర్ అమ్మకు నమ్మిన బంటు. అమ్మ ఉన్న సమయంలో ఆమె ఏది చెబితే అది పన్నీర్ ఆచరించేవాడు. పలు సందర్భాల్లో జయ జైలుకు వెళ్లిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టాడు. ఆ సమయంలో పన్నీర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూడా కూర్చోలేదు. అది అమ్మ సీటు అని అక్కడ తాను కూర్చోనని అలాగే పాలన సాగించాడు. అంతలా అమ్మకు పన్నీర్ వీరవిధేయుడిగా ఉన్నారు. అమ్మ మరణం తరువాత శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం ఆమెని ముఖ్యమంత్రి చేయడం కోసం తన పదవికి రాజీనామా చేయడంతో అమ్మ కు వలే చిన్నమ్మకు సైతం పన్నీర్ వీర విధేయుడిగా మారుతున్నారని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఒక్కసారిగా పన్నీర్ శశికళను ఎదురుతిరగడంతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మధ్యంతర ఎన్నికలు సైతం రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.