ఆమ్మో మన బ్యాంకుల్లో ఆ డిపాజిట్లు అన్ని వేల కోట్లా ?

Monday, March 19th, 2018, 10:54:08 PM IST


కొందరు బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేసి అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని తీసుకోకపోయినా, ఆ డిపాజిట్‌దారులు చనిపోయి వారి వారసుల వివరాలు లేకపోవడంతో ఆయా ఖాతాల్లోని డిపాజిట్లు అన్‌క్లెయిమ్‌డ్‌గా మారిపోతాయి. అటువంటి డిపాజిట్ డబ్బులు బాంక్ ల్లోనే నిల్వ ఉంటాయి. అటువంటి అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్లు మన దేశ బ్యాంకుల్లో వున్న మొత్తం తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే మరి . అలా 64 బ్యాంకుల్లోని దాదాపు 3కోట్లకు పైగా ఖాతాల్లో ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు రూ. 11,300కోట్లు అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. వీటిలో అత్యధికంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(పీఎన్‌బీ)లో రూ. 1,262కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)లో రూ. 1,250కోట్లు అన్‌క్లెయిమ్‌డ్‌గా ఉన్నాయి.

ఇక మిగతా అన్ని జాతీయ బ్యాంకుల్లో కలిపి రూ. 7,040కోట్లు ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో రూ. 1,416కోట్లు అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. మిగతా రూ.332కోట్లు మన దేశంలో కొనసాగుతున్న 25 విదేశీ బ్యాంకుల వద్ద ఉన్నాయి. ఏడు ప్రైవేటు బ్యాంకులు యాక్సిస్‌ బ్యాంక్‌, డీసీబీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్‌, కొటక్‌ మహింద్రా, యస్‌ బ్యాంక్‌లు కలిపి రూ. 824కోట్లు, మరో 12 ప్రైవేటు బ్యాంకుల్లో రూ. 592కోట్లు అన్‌క్లెయిమ్‌డ్‌గా పడి ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఐసీఐసీఐలో రూ. 476కోట్లు, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌ వద్ద రూ. 151కోట్లు అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి….