ఆ రోజు సచిన్ ని చూస్తే భయం వేసింది అంటున్న సౌరవ్…!!

Monday, August 6th, 2018, 05:00:12 PM IST

భారత ప్రఖ్యాత క్రికెటర్లలో అటు సచిన్ మరియు ఇటు సౌరవ్ గంగూలీ, ఇద్దరికీ కూడా మంచి క్రీడా ప్రతిభ ఉందని చెప్పవచ్చు. కాగా సౌరవ్ గంగూలీ మరియు సచిన్ ఇద్దరు కూడా తమ 14వ ఏటనుండి మంచి మిత్రులు. తాను ఆ వయసు నుండే సచిన్ ఆటను గ్రహించేవాడిని అని, ఇక ఆతరువాత ఇండియన్ క్రికెట్ టీం కి సెలెక్ట్ అయ్యాక సచిన్ ఏ సమయంలో ఎలా ఆడుతున్నాడు, జట్టుకు ఎటువంటి సాయం అందిస్తున్నాడు అనేవి గమనిస్తుండేవాడిని అని గంగూలీ అన్నారు. బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షో లో పాల్గొన్న సౌరవ్, సచిన్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సచిన్, వినోద్ కాంబ్లీ మరియు తాను ముగ్గురు ఎక్కువగా కలిసి ఉండేవారమని అన్నారు. ఒకానొక సమయంలో ఇండోర్ నేషనల్ క్యాంపులో పాల్గొనేందుకు మమ్మల్ని మా సర్ విపరీతంగా పరుగులెత్తించేవారని, మాకు కేవలం ఆదివారాలు మాత్రమే సెలవు దొరికేదని గంగూలీ చెప్పారు.

ఇక ఆదివారం మంచి ఫుడ్ తిని మధ్యాహ్నం సమయంలో నిద్రపోయేవాళ్లమని, అయితే ఒక ఆదివారం అలాగే పడుకొన్న తాను, సాయంత్రం నిద్ర లేచి చూసేసరికి పక్కన సచిన్, కాంబ్లీ ఇద్దరు లేరని, తీరా చూస్తే రూమ్ మొత్తం కూడా నీటితో నిండిపోయిందని, ఒకవేళ పైన నీళ్ల ట్యాంకర్ లీక్ అయిందేమో అనుకున్నానని అన్నారు. కానీ తలుపు తెరిచి చూసినదాన్నిబట్టి ఆ నీరు లీక్ కావడం కాదు, సచిన్ మరియు కాంబ్లీలు ఆ విధంగా తనను నిద్ర లేపడంకోసం బకెట్లతో నీటిని గదిలో గుమ్మరించారని తెలుసుకుని నవ్వుకున్నానని, ఆ సరదా ఘటనను గంగూలీ గుర్తు చేసుకున్నారు. ఇకపోతే ఒకానొక సమయంలో ఇండియన్ టీం ఇంగ్లాండ్ పర్యటనలో వుండగా రూమ్ లో సచిన్ మరియు తాను డిన్నర్ చేసి పడుకున్నామని, అంతే హఠాత్తుగా నిద్రమధ్యలో సచిన్ లేచి అటు ఇటు కాసేపు తిరగ సాగాడని, తరువాత వచ్చి మాములుగా పడుకున్నాడని చెప్పారు. అలానే మరుసటి రోజు కూడా నిద్రలో లేచి కాసేపు అటుఇటు తిరుగుతూ కాసేపటితరువాత మళ్ళి పడుకునేవాడని, ఆ ఘటన చూసి తనకు గుండెల్లో భయం వేసిందని అన్నారు. కాగా ఆ విషయమై రెండురోజుల తరువాత సచిన్ ని అసలు ఎందుకు పడుకున్న తరువాత నిద్రలో లేచి నువ్వు అలా తిరుగుతున్నావు అని అడగ్గా తనకు నిద్రలో నడిచే అలవాటు ఉందని సచిన్ చెప్పడంతో తనకు నమ్మలేనంత ఆశ్చర్యం కలిగిందని గంగూలీ అన్నారు…….

  •  
  •  
  •  
  •  

Comments