తెలివైన పవన్.. అమ్మతోనే చెప్పించాడు !

Wednesday, October 31st, 2018, 10:27:19 AM IST

పవన్ కళ్యాణ్ ఈ మధ్య తన పార్టీ యొక్క పాక్షిక ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో పాటే ఆయన తరచూ కొన్ని వాగ్దానాలు చేస్తున్నారు. వాటిలో ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం అనేది కూడ ఒకటి ఉంది. ఈ సిపిఎస్ విధానం చాలా మంది ఉద్యోగులకు నచ్చడంలేదు. దీని మూలాన నెల నెలా వచ్చే పెన్షన్ సౌలభ్యం లేకుండా సింగిల్ సెటిల్మెంట్ అయిపోతుండటం తమకు, తమ కుటుంబాలాకు చాలా ఇబ్బంది కలిగిస్తోందని వాపోతున్న ఉద్యోగులు చాలా కాలం నుండి దీక్షలు కూడ చేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు కోసం పవన్ ఈ అంశాన్నే తన హామీల్లో ప్రధానంగా చేర్చుకున్నారు. పలుసార్లు ఈ విధానాన్ని రద్దుచేస్తామని చెప్పిన ఆయన నిన్న తన పార్టీ ఆఫీసుకు వచ్చిన తన తల్లి అంజనాదేవిగారి చేత కూడ పెన్షన్ యొక్క ప్రాముఖ్యతను చెప్పించి, తాన్ ఉద్దేశ్యాన్ని జనాలకు తెలసేలా చేశారు. నిన్న పవన్ పార్టీకి 4 లక్షల ఫండ్ ఇచ్చిన అంజనాదేవిగారు ఈ మొత్తాన్ని తన భర్త చేసిన పోలీస్ ఉద్యోగం ద్వారా నెల నెలా తనకు అందిన పెన్షన్ ద్వారానే ఇవ్వగలిగానని, ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగుల కుటుంబాలకు ఈ పెన్షన్ ఎంతో మేలు చేస్తుందని అన్నారు.

ఈ సందర్బంగా పవన్ కూడ తన తల్లి ఇచ్చిన విరాళం ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్న సిపిఎస్ విధాన రద్దుకు కృషి చేయాలని గుర్తుచేసింది. అందుకే నిరసన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు నా మద్దత్తు ఎప్పుడూ ఉంటుంది అంటూ తన ఉద్దేశ్యాన్ని, హామీని తన తల్లిగారి ద్వారా జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.