మరోసారి మాట్లాడుతూ తడపడ్డ లోకేష్.. ఈ సారి ఎక్కడంటే?

Tuesday, April 3rd, 2018, 03:20:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఇదివరకు పలుమార్లు తెలుగు మాట్లాడంలో తడపడడం చూసాము. ఆయన విదేశాల్లో చదివి వచ్చారు కనుక తెలుగు పై అంతగా పట్టలేక అలా తప్పులు మాట్లాడుతున్నారు అని తొలినాళ్లలో అందరూ అనుకునేవారు. అయితే ఆ తర్వాత కూడా ఆయన పలుమార్లు అదే విధంగా తప్పులు మాట్లాడడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయన్ని తెలుగు సరిగా నేర్చుకోమని సలహాలు ఇచ్చిన సందర్భాలు లేకపోలేవు. అయితే ఆ తర్వాత ఆయన తెలుగు భాషపై మంచి పట్టు సాధించి సభల్లో, సమావేశాల్లో కొంతవరకు మెరుగ్గా మాట్లాడుతున్నారు. కాగా ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఆయన మరోసారి తెలుగు మాట్లాడడంలో తడపడ్డారు.

అసెంబ్లీలో గ్రామీణ మంచినీటి పథకాలపై లఘు చర్చ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ఆయన వివరించారు. చివరగా తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ “నాపై వచ్చిన ఆరోపణలలో అవాస్తవాలు లేకపోయినా బురదజల్లుతున్నారు” అని చెప్పటంతో కొందరు ఎమ్మెల్యేలు అర్థంకాక విస్తుపోయారు. దీంతో లోకేష్ వెంటనే తేరుకుని ఆరోపణలలో వాస్తవాలు ఉంటే ప్రజల మధ్య చర్చిద్దామని సరిచేసుకున్నారు. తదనంతరం గిరిజన ప్రాంతాల్లో మంచినీటి సరఫరా విషయమై మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో అనే పదాన్ని ఐటీపీఏ అని చదువుతుండగా పక్కనున్న ఎమ్మెల్యేలు ఆయన తప్పులను సవరించారు. చిన్న వయస్సులో మంత్రి కావటం అదృష్టంగా బావిస్తున్నట్లు మంత్రి నారాలోకేష్ అన్నారు.

తాను ఏరోజూ లాలూచీ పడలేదని, హెరిటేజ్ ని అమ్మ, బ్రాహ్మణీ ఇద్దరూకలిసి అద్భుతంగా నడిపిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో సూపర్ సీనియర్లు ఉన్నారని వాళ్లు సలహాలు, సూచనలు ఇస్తున్నారని చెప్పారు. అందరి సహకారం కావాలని – లేని పోని ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. 75సంవత్సరాల స్వతంత్య్ర దేశంలో ఇంకా తాగునీటి సమస్య ఉండటం బాధాకరమన్నారు. మనిషి పుట్టిన దగ్గర నుండి అంతిమ యాత్ర వరకు నీరు అవసరమని – రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై పెట్టారని లోకేష్ అన్నారు. దీనిలో భాగంగానే మార్చి-2019నాటికి కలుషిత తాగునీరు లేని విధంగా మార్చి-2020నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదవాడి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆ విధంగా ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కేంద్రంతో పోరాడుతూనే ఉంటామని అన్నారు…..