ఒక్క నెలలో లక్ష కోట్లా..? అవన్నీ ట్యాక్సులే..!

Tuesday, May 1st, 2018, 03:38:00 PM IST

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)ను ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ఒకే నెలలో వసూళ్లు లక్ష కోట్లు దాటాయి. చెప్పాలంటే ఒకమట్టుకు ఇది నిజంగా ఆశ్చర్యకరం అనుకోవచ్చు. ఏప్రిల్ నెలకుగాను రూ.1.03 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు తాజాగా ఆర్థికశాఖ వెల్లడించింది. గతేడాది జులైలో జీఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత ఒకే నెలలో లక్ష కోట్లు రావడం చరిత్రలో ఇదే తొలిసారి. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడటమే దీనికి కారణం కావచ్చని ప్రభుత్వం అభిప్రాయాన్ని వ్యక్తపరచింది. అయితే గతేడాది ఎరియర్స్ కూడా ఏప్రిల్‌లో రావడం వల్ల జీఎస్టీ వసూళ్లు పెరిగి ఉండొచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. రానున్న కొద్ది నెలల్లో జీఎస్టీ వసూళ్లు ఇంకా పెరుగుతాయని ప్రభుత్వం భారీ స్థాయిలో అంచనాలు వేస్తున్నది.

ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ-వే బిల్‌ను అమలు చేసింది ఆర్ధిక శాఖ. ముఖ్యంగా ఇది గూడ్స్ ట్రాకింగ్ కోసం ఇది పనికొచ్చేలా ప్రత్యేకంగా దీన్ని ప్రవేశ పెట్టారు. దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నుఎగ్గొట్టే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. టర్నోవర్‌ను తక్కువ చేసి చూపించడం, కొన్ని లావాదేవీలను బుక్స్‌లో ఎంటర్ చేయకుండా ఉండే వీలు ఎక్కడా ఉండదు. ఇక ఏప్రిల్‌లో నెలలో వసూలైన లక్షా 3 వేల కోట్ల జీఎస్టీలో 18,652 కోట్ల సెంట్రల్ జీఎస్టీ, 25704 కోట్ల స్టేట్ జీఎస్టీ, 50548 కోట్ల ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, 8554 కోట్ల సెస్ ఉన్నట్లు ఆర్థికశాఖ వెల్లడించింది.