మా పార్టీకి 100 సీట్లు ఖాయం!

Sunday, September 2nd, 2018, 12:20:36 PM IST

టిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నేడు తలపెట్టిన ప్రగతి నివేదన సభకు ప్రజలు ఎక్కడెక్కడినుండో లక్షలాదిగా తరలివెళుతున్నారు. ఇప్పటికే సభకు ప్రజలు తరలిరావడానికి ఎటువంటి ఇబ్బందులు పడకుండా టిఆర్ఎస్ పార్టీ అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులను తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సభ ప్రాంగణంలో ఉదయంనుండి టిఆర్ఎస్ కార్యకర్తల కోలాహలం మొదలయింది. ఇక నేడు ప్రగతి నివేదన సభకు సిద్దిపేటనుండి తరలివెళుతున్నా దాదాపు 150కి పైగా ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు, అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రగతి నివేదన సభతో ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని,

తాము సభ ఏర్పాటు చేస్తే ప్రతిపక్షాలకు ఎందుకు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయి అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే సభకు వస్తున్న ప్రతిస్పందనను బట్టి చూస్తే తమ పార్టీ పై ప్రజల్లో ఎంతమేర ఆదరణ ఉందొ తెలుసుకోవచ్చని, ప్రజల కోసం, ప్రజా సంక్షేమమే ద్యేయంగా ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీకి మరొక్కసారి పట్టంకట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నాయని అయన అన్నారు. ఇప్పటికే తమ పార్టీకి 100కు పైగా సీట్లు వస్తాయని నమ్మకముందని, ఇక రాబోయే రోజుల్లో వాటి సంఖ్య మరింత పెరగవచ్చని అయన ఆశాభావం వ్యక్తం చేసారు. గత ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళ్లడం దగ్గరినుండి ప్రజల ఓట్లు సంపాదించి, వారి తీర్పుతో అధికారాన్ని చేపట్టిన దగ్గరినుండి నేటివరకు తమ పార్టీ ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండ పాటిస్తోందని,

అధినేత కేసీఆర్ ప్రజాక్షేమమే ద్యేయంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. ఈ నివేదన సభ ఏర్పాటుచేస్తే తమకు ప్రజల్లో మరింత ప్రాభవం పెరుగుతుందనే భయంతోనే ప్రతిపక్షాలు సభను జరగనివ్వకూడదనే కుట్ర చేస్తున్నాయి అని ఆయన ఆరోపించారు. ఏపార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా, తాము చెప్పేది ఒక్కటే అని, రాబోయే ఎన్నికలో తమ గెలుపును ఆపడం ఎవరి వల్లా కాదని, కేసీఆర్ మరొక్కమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఖాయమని అయన ధీమా వ్యక్తం చేశారు…..

  •  
  •  
  •  
  •  

Comments