మా రాజీనామాలు ఆమోదించాల్సిందే : వైసిపి ఎంపీలు

Tuesday, May 22nd, 2018, 06:26:30 PM IST

కేంద్రంలోని బిజెపి పార్టీ వారు అధికారం చేపట్టిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా, అలానే విభజన హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చి, మాట తప్పడంతో ప్రతిపక్షాలు బిజెపి తీరుకు వ్యతిరేకంగా పలురకాల నిరసనలు వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో పార్లమెంట్ వేదికగా టీడీపీ సహా వైసిపి ఎంపీలు హోదా కోసం పోరాటం చేశారు. అంతటితో ఆగకుండా అంతక ముందు వారు చెప్పినట్లు తమ
ఎంపీ పదవులకు రాజీనామా కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు తమ రాజీనామాలను స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆమోదించలేదు. కాగా వారి రాజీనామాల విషయమై స్పీకర్ ఆ ఎంపిలను ఈ నెల 29న ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వవలసిందిగా కోరారు. వాస్తవానికి తమ రాజీనామాలపై ఇప్పటివరకు నిర్ణయం ఎందుకు తీసుకోలేదు, ఆమోదం ఎందుకు తెలుపలేదు అని ఇదివరకే వారు స్పీకర్ ను సంప్రదించడంతో ఆమె మే 1న, ఆ తరువాత మే 7 వారిని కలిసేందుకు సమయం కేటాయించారు.

అయితే పలు కారణాల వల్ల ఆమెను కలవలేకపోయిన ఎంపీలు చివరిగా ఈనెల 29న ఢిల్లీ వచ్చి కలవాలని స్పీకర్ వారికి విడివిడిగా లేఖలను పంపినట్లు తెలుస్తోంది. స్పీకర్ ఎన్ని చెప్పినప్పటికీ ఎట్టిపరిస్థితుల్లో తమ రాజీనామాలను ఆమోదింప చేసుకుంటామని, తాము ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వర ప్రసాద్, మిదున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా ప్రత్యేక హోదా తేవాలని తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి మొదటినుండి ఎంతో పట్టుదలతో వున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాలకోసం ఏపీని కేంద్రానికి తాకట్టుపెట్టి తమ పబ్బం గడుపుకుంటున్నారని వారు విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ తాము ఢిల్లీ వెళ్లి రాజీనామాల ఆమోదం తర్వాత తిరిగి జరిగే ఉప ఎన్నికల్లో మళ్ళి తమ చిత్తశుద్ధి ఏమిటో నిరూపించుకుంటామని, ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేదిలేదని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments