మాది యువతరం పార్టీ, వారిలా అన్ని దోచేసిన వృద్ధుల పార్టీ కాదు : పవన్

Saturday, July 14th, 2018, 03:46:59 AM IST


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజాపోరాట యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన యాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. అంతే కాదు యాత్ర మధ్యలో పార్టీలో చేరుతున్నవారిని పవన్ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల స్థానికుల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న పవన్, వారి పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. మీ పరిస్థితులు కష్టాలను చూస్తుంటే, అసలు మన రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం తనకు కలుగుతోంది అని అన్నారు. ఇప్పటికే తాను యాత్ర చేపట్టిన దాదాపు మెజారిటీ ప్రాంతాల ప్రజలు పలు రకాల సమస్యలతో తన వద్దకు వచ్చి మొర పెట్టుకోవడం చాల బాధ కలిగించిందని అన్నారు.

గత ఎన్నికల సమయంలో అసలు తాను టీడీపీకి మద్దతు ఇచ్చి తప్పు చేసినట్లు చెప్పుకొచ్చారు.
వాళ్ళు ప్రజల సమస్యలను గాలికొదిలేశారని నిలదీస్తుంటే మన పార్టీ, కేంద్రం వారికీ అమ్ముడుపోయిందని, నేను మోడీ గారి కనుసన్నల్లో పనిచేస్తున్నాని అంటున్నారు. ఇలాంటి నిందలు వేయడం వారికే చెల్లిందని, మీ తప్పులను ఎత్తి చూపితే మాపై ఇలాంటి నిందలు ఎన్నాళ్లు వేస్తారు. చూసాం చూసాం, ఓర్పు వహించాం, ఇక మీకు మీ పార్టీలకు కాలం చెల్లిపోయిందని మండిపడ్డారు. ఎవరు జనసేన గురించి కానీ నా గురించికాని మాట్లాడినపుడు, అది ఒక చిన్న పిల్లల పార్టీ, దాన్ని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు, పవన్ కు అసలు రాజకీయాలమీద అవగాహన లేదు, ఏదో తెలిసి తెలియక మాట్లాడుతుంటాడు అని అంటున్నట్లు చెప్పారు.

అయితే మాది చిన్న పిల్లల పార్టీ కాదు, అన్ని దోచేసి, రాష్ట్రాన్ని ముంచేసిన వృద్ధుల పార్టీ అంతకన్నా కాదు, మాది యువతరం పార్టీ, నవతరం పార్టీ అని గొంతెత్తి పలికారు. ఆయన మాటలకు అక్కడి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. తనకు రాజకీయాల్లో పోటీ చేసిన అనుభవం లేకపోయినప్పటికీ, రాజకీయాలంటే ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలిసిందని,వారిలా తాను నీచ రాజకీయాలు చేయనని, తమ పార్టీ కేవలం ప్రజల కోసం, ప్రజల కొరకు, స్థాపించబడిన పార్టీ అని అన్నారు. కావున రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమ పార్టీకి తప్పక పట్టం కడతారన్న నమ్మకం తనకు ఉందని నొక్కి వక్కాణించారు…..

  •  
  •  
  •  
  •  

Comments