నమ్మినవారే చంద్రబాబుకు ద్రోహం చేశారంటున్నటిడిపి నేత

Friday, March 2nd, 2018, 03:20:34 PM IST

తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, పార్టీకి చెందిన ఒక్కొక్క నాయకుడు బయటికి వెళ్లిపోవడం చూస్తుంటే బాధేస్తోందని, ఒకప్పుడు ఎందరో నేతలను గొప్ప గొప్ప నాయకులుగా మారేందుకు అవకాశామిచిన పార్టీ ఇవాళ ఈ స్థితికి రావడం చూడలేకపోతున్నానన్నారు టిడిపి మాజీ మంత్రి, ఆపార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. అలానే అప్పట్లో పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేస్తే బాగుంటుందని చంద్రబాబుకు ఒక సలహా కూడా ఇచ్చి పెను సంచలనానికి ఆయన తెర లేపిన విషయం మనకు తెలిసిందే.

అయితే అప్పట్లో పార్టీ పరిస్థితి చూసి అలా అన్నానని తాను చేసిన విలీన వ్యాఖ్యలపై పార్టీ కార్యకర్తలకు, పార్టీ అధినేత చంద్రబాబుకు క్షమాపణ చెప్పారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన నేను లేకుండానే నిన్న టీటీడీపీ సమావేశం జరగడం బాధేసిందన్నారు. కీలక సమయాల్లో చంద్రబాబుకు అండగా ఉన్నానని, నన్ను చంపాలని కొందరు రెక్కీ చేసినా చంద్రబాబును వీడలేదనన్నారు. ఎన్టీఆర్‌ దగ్గర ఎలా పని చేశానో చంద్రబాబు దగ్గర కూడా అలాగే ఎంతో నమ్మకంగా ఉంటున్నాను అన్నారు.

తెలంగాణ వాదం వచ్చినప్పుడు కూడా చంద్రబాబు తరఫున నేను తప్ప ఎవ్వరూ మాట్లాడలేదు. అప్పట్లో చంద్రబాబుపై చాలామంది అనేక రకాల విమర్శలు చేశారు. అటువంటి సమయంలో ఏ టీడీపీ నాయకుడు కూడా ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టి వాటిని ఎదిరించలేకపోయాడన్నారు. అప్పట్లో తెలంగాణలో టీడీపీ తరఫున మాట్లాడితే చంద్రబాబుకి అనుకూలం అనుకుంటారని అందరూ భయపడిపోయారని అయన గుర్తుచేశారు. కానీ నేను మాత్రమే చంద్రబాబు తరఫున నిలబడి మాట్లాడాను.

చంద్రబాబును స్వయానా పార్టీ నేతలే అవమానపరిచారు. ఒకానొక సమయంలో కొందరు రెక్కీ నిర్వహించి నన్ను చంపాలనుకున్నారు. ఇవన్నీ చంద్రబాబుకి తెలుసు. నా జీవితం బలిచేసి చంద్రబాబు పక్కన నిలబడ్డా. అందుకు గర్విస్తున్నాను. ఇటువంటి అవకాశం అందరికీ రాదు. పేద ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి మాట్లాడాను. చంద్రబాబు నాకు ఏమిచ్చినా, ఏమి ఇవ్వకపోయినా నేను చంద్రబాబు తమ్ముడిలాంటి వాడినే. తెలంగాణలో పటిష్ఠమైన నాయకత్వం లేదు, ఒకప్పుడు నీతి, నిజాయితీలకు పెట్టింది పేరైన టీడీపీ నాయకత్వం సరిగ్గా లేక భ్రష్టుపట్టిపోయింది అని అన్నారు.

ఒకప్పుడుఎవరికైతే చంద్రబాబు గొప్ప గొప్ప పదవులు కట్టబెట్టారో ప్రస్తుతం అటువంటివారే చంద్రబాబుకి ద్రోహం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన అన్న ఈ మాటలు ఇటీవల టీడీపిని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అని గుసగుసలు వినిపిస్తున్నాయి…