సమీక్ష : ‘పాఠశాల’ – మన జీవితమే ఈ పాఠశాల.

Saturday, October 11th, 2014, 08:00:47 AM IST
విడుదల తేదీ : 10 అక్టోబర్ 2014
నేటిఎపి. కామ్ రేటింగ్ :3/5 
దర్శకత్వం : మహి వి రాఘవ్
నిర్మాత :  రాకేష్ మహంకాళి, పవన్ కుమార్ రెడ్డ
సంగీతం : రాహుల్ రాజ్
నటీనటులు : నందు, శివ, శశాంక్, అనుప్రియ, శిరీష, సాయి కిరణ్ .

కొత్త తరహా ప్రమోషన్ కార్యక్రమాలతో గత కొంత కాలంగా ప్రేక్షకులలో ఆసక్తిని రేపిన సినిమా ‘పాఠశాల’. సోషల్ మీడియాలో యువత కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. రోడ్ జర్నీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా మహి వి రాఘవ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. గతంలో ఈ ఎన్నారై ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాలను నిర్మించారు. ‘వినాయకుడు’ సినిమాకు రచయితగా వ్యవహరించారు. న్యూ ఏజ్ కాన్సెప్ట్ స్టొరీ ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం..

కథ :

ఐదుగురు స్నేహితులు రాజు(నందు), సూర్య(శివ), ఆది(సాయి కిరణ్), సాల్మా(శిరీష), సంధ్య(అనుప్రియ)లు నాలుగేళ్ల పాటు కాలేజీ లైఫ్ చాలా జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ఒకరినొకరు విడిచి వెళ్ళాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. అప్పుడు కాలేజీ ప్రిన్సిపాల్ (సూర్య) ఇచిన సలహాతో అందరి ఇళ్ళకు వెళ్ళాలని ప్లాన్ చేస్తారు.

నెల రోజులు.. 5 వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఈ ప్రయాణం వారిని వారికే కొత్తగా పరిచయం చేస్తాయి. కాలేజీలో తమ స్నేహితుల గురించి తెలియని కొత్త విషయాలు తెలుస్తాయి. అవి ఏమిటి..? ఈ ప్రయాణంలో పరిచయం అయిన కార్తీక్ (శశాంక్ ) ఎవరు..? కార్తీక్ పరిచయంతో ఈ ఐదుగురి స్నేహితులలో కలిగిన మార్పు ఏంటి..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడండి..!

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ మహి వి రాఘవ్ ఎంచుకున్న కథ, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్. తెలుగులో ఈ తరహా రోడ్ జర్నీ సినిమా ఇప్పటివరకు రాలేదనే చెప్పాలి. ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మోడ్రన్ సినిమాలు, హిందీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

ఆర్టిస్టులలో ముఖ్యంగా చెప్పుకోవలసింది నందు, శశాంక్ ల పెర్ఫార్మన్స్ గురించి. రాజు పాత్రలో నందు బాగా నటించాడు. ఈస్ట్ గోదావరి యాసలో అతను చెప్పే ఫన్నీ డైలాగులు ప్రేక్షకులను నవ్విస్తాయి. అత్తతో ఫోన్ లో మాట్లాడే సన్నివేశం అతనిలో ఎమోషనల్ యాంగిల్ చూపింది. కార్తీక్ పాత్రలో శశాంక్ నటన కంట తడి పెట్టించింది. ఏదో అలా నార్మల్ గా సాగిపోతున్న సినిమాని టర్న్ చేశాడు. తన ప్రేయసికి ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశం మనసులను కదలించింది. ఒక సన్నివేశం అయినా యల్ బి శ్రీరామ్, సూర్యలు తమ అనుభవాన్ని రంగరించి సన్నివేశాలకు బలాన్ని చేకూర్చారు. నందు స్నేహితులుగా శివ, అనుప్రియ, శిరీష, సాయి కిరణ్ లు బాగానే నటించారు.

ఇక సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు బ్యాక్ బోన్ లా నిలిచాయి. సినిమాటోగ్రాఫర్ సుధీర్ సురెంద్రన్ దర్శకుడు మహి వి రాఘవ్ ఆలోచలను అందంగా తెరపై ఆవిష్కరించాడు. రాహుల్ రాజ్ తన సంగీతంతో సినిమాలో ఫీల్ ని ఎలివేట్ చేశారు.

మైనస్ పాయింట్స్ :

కథ కొత్తగా ఉంది.. కాకపోతే కథనం చాలా నత్త నడనకన సాగింది. మధ్యలో కొన్ని సన్నివేశాలు మెరుపులు మెరిపిస్తున్నా, సినిమా సాగదీసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. దీనికి ముఖ్య కారణం సినిమా అంతా ప్రయాణంలో సాగడమే. ప్రధాన పాత్రల స్వభావాలు గతంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘గమ్యం’ సినిమాలలో పాత్రలను గుర్తుకు తెస్తాయి.

సినిమాకి స్క్రీన్ ప్లే సరిగా లేదు. సాంగ్స్ ప్లేస్ మెంట్ కూడా అంతగా సెట్ అవ్వలేదు. సినిమా ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత వేగం, సెకండ్ హాఫ్ లో లేదు. ఇంటర్వెల్ తర్వాత నుంచి శశాంక్ పాత్ర ఎంటర్ అయ్యే వరకూ ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. శశాంక్ పాత్రతో ఐదుగురు స్నేహితులు అంత క్లోజ్ ఎలా అయ్యారు అనే విషయం తెలియడానికి మరో రెండు సన్నివేశాలు పెట్టాల్సింది. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ఇంకొంచం బాగా రాసుకుని ఉంటె బాగుండేది. రెగ్యులర్ మాస్ కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో లేకపోవడం మరో మైనస్ పాయింట్.

సాంకేతిక విభాగం :

ముందుగా చెప్పుకున్నట్టు.. సంగీతం, సినిమాటోగ్రఫీ టెక్నికల్ విభాగంలో ది బెస్ట్ గా నిలిచాయి. స్వేఛ్చ వర్షం సాంగ్ సినిమాలో హైలైట్ గా నిలిచింది. ఇతర పాటల్లో, రీ రికార్డింగ్ సౌండింగ్ కొత్తగా ఉంది. సుధీర్ సురెంద్రన్ సినిమాటోగ్రఫీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు అందంగా చిత్రీకరించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ కాస్త నిడివి తగ్గించి ఇంటర్వెల్ తర్వాత మొదట వచ్చే కొన్ని సన్నివేశాలను కత్తిరించి ఉంటె బాగుండేది.

దర్శకుడిగా పరిచయమైన మహి వి రాఘవ్, తొలి సినిమాకు మంచి కథ రాసుకున్నాడు. డైలాగులు, సన్నివేశాలు కూడా బాగున్నాయి. అయితే మైనస్ పాయింట్ లలో చెప్పుకున్నట్టు స్క్రీన్ ప్లే ఇంకొంచం బాగా రాసుకుంటే బాగుండేది. శేఖర్ కమ్ముల, అడవి శేష్, క్రిష్ వంటి ఇతర ఎన్నారై దర్శకుల తరహాలో మానవ సంబంధాలను, వారి సంబంధాలను, ఎమోషన్స్ ను తెరపై అద్బుతంగా పండించాడు. మొదటి సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.

తీర్పు :

మన జీవితమే ఓ ‘పాఠశాల’, మన జీవిత గమనంలో జరిగే సంఘటనలు, ప్రయాణంలో తారసపడే వ్యక్తులు ద్వారా అనేక పాఠలు తెలుసుకుంటాం. అవి మన భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని తెలియజేసే సినిమానే ‘పాఠశాల’. తెలుగు తెరపై వచ్చిన కొత్త తరహా సినిమా ఇది. మనసుకు నచ్చిన పని చేయడంలో మన అనందం ఉంటుందని ఈ సినిమాలో చెప్పారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఆశించే ప్రేక్షకులకు ఈ సినిమా రుచించక పోవచ్చు. భావోద్వేగాలను ఆస్వాదించే సున్నిత ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాలోని 5 పాత్రల్లో ఏదో ఒక పాత్రలో తమను తాము ఊహించుకుంటారు. కంప్లీట్ ఫ్యామిలీ కలసి చూసే అందమైన సినిమా ఇది.

నేటిఏపి.కామ్ రేటింగ్ : 3/5