బిగ్ షాక్‌ : ప‌ద్మినీరెడ్డి యూట‌ర్న్?!

Friday, October 12th, 2018, 10:15:20 AM IST

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహ స‌తీమ‌ణి ప‌ద్మినీరెడ్డి అనూహ్యంగా బీజేపీలో చేర‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే 24గంట‌లు అయినా గ‌డ‌వ‌క ముందే మ‌న‌సు మార్చుకోవ‌డం యూట‌ర్న్ తీసుకోవ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌కొచ్చింది.

భాజ‌పాలో చేరుతున్నాన‌ని ప‌ద్మినిరెడ్డి ప్ర‌క‌టించ‌డ‌మే పెద్ద షాక్ అనుకుంటే ఈ యూట‌ర్న్ రాజ‌కీయం ఇంకా పెద్ద షాక్‌. ప‌ద్మిని భాజ‌పాలో చేరడంతో ముఖ్యంగా మ‌హాకూట‌మితో టీఆర్ ఎస్‌కు చెక్‌ పెట్టాల‌నుకున్న కాంగ్రెస్‌కు సెల్ఫ్ గోల్‌గా మారింది. అధికార టీఆర్ ఎస్ పార్టీ కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టేలా చేసింది. ఉద‌యం 12 గంట‌ల‌కు దామోద‌ర‌కు తెలియ‌కుండానే బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప‌ద్మినీరెడ్డి సాయంత్రానికే బీజీపీని వీడుతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం… ఆ త‌ర్వాత కొన్ని గంట‌ల్లోనే తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తొలుత గురువారం ఉద‌యం మోదోల్‌లో పార్టీ ప్ర‌చారంలో వున్న దామెద‌ర‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండానే ప‌ద్మినిరెడ్డి బీజేపీలో చేరడంతో సొంత పార్టీ నేత‌లే దామోద‌ర‌పై మండిప‌డ్డార‌ట‌. దీంతో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు మొద‌లుపెట్టిన దామోద‌ర చ‌క‌చ‌కా పావులు క‌దిపి భార్య‌ను బుజ్జ‌గించ‌డం వ‌ల్లే తిరిగి ఆమె కాంగ్రెస్‌లో చేరింద‌ట‌. ప‌ద్మినీరెడ్డి బీజేపీలో చేర‌డం వెనుక పెద్ద మంత్రాంగ‌మే వున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నిక‌ల్లో త‌న‌తో పాటు ప‌ద్మ‌నికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల‌ని దామోదర పార్టీ పెద్ద‌ల‌ను కోర‌డం వారు సున్నితంగా తిర‌స్క‌రించ‌డం జ‌రిగాయ‌ట‌. దీంతో ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే త‌ను ఎన్నిక‌ల ప్ర‌చారంలో వున్న స‌మ‌యంలోనే ప‌ద్మినిరెడ్డిని బీజేపీలో చేర‌మ‌న్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ త‌రువాత జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల అనంత‌రం మ‌ళ్లీ ప‌ద్మినిరెడ్డిని కాంగ్రెస్ గూటికి దామోద‌ర తీసుకొచ్చాడ‌ని పార్టీ సీనియ‌ర్లు చ‌ర్చించుకుంటున్నార‌ట‌. ఎంత ప్లాను…ఏమి ప్లాను దామోద‌రా.