పన్నీర్ యుద్ధానికి రథం రెడీ..!!

Thursday, February 23rd, 2017, 01:54:00 AM IST


శశికళని అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు శాసన సభా పక్ష నేతగా ఎన్నుకోవడం దగ్గర నుంచి పళని స్వామి అసెంబ్లీలో బల పరీక్ష నెగ్గడం వరకు అంతా రెండు వారాల్లోపే జరిగిపోయింది.దీనితో ప్రజా మద్దత్తు ఉండి కూడా పన్నీర్ సెల్వం ఎమ్మెల్యే ల మద్దత్తుని కూడగట్టలేకపోయారు. దీనికి తోడు శశికళ ఎత్తులు వేసి పళని స్వామిని ముఖ్యమంత్రిని చేయడంతో పన్నీర్ కు నిరాశే మిగిలింది.దీనితో నేరుగా ప్రజల్లోనే తేల్చుకోవాలని ఆయన సిద్ధం అయ్యారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించడానికి ఆయన సమాయత్తం అవుతున్నారు.

దీనికోసం జయలలిత ఫొటోలతో ఉండే ప్రచార రధాన్ని కూడా పన్నీర్ వర్గం సిద్ధం చేసింది. మహీంద్రా జీపుని కొంత మార్పులు చేసి ఆయన ఈ ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు. శశికళ వైఖరిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ఆమె వర్గంపై వ్యతిరేకతని వ్యాపింపజేసి ప్రజలను పూర్తిగా తనవైపు కు తిప్పుకోవాలని పన్నీర్ భావిస్తున్నారు. పళనిస్వామి ప్రభుత్వం ఎక్కువరోజులు నిలబడదని సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ముందుగా ప్రజల్లో తనపై మంచి అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు అసలైన అన్నా డీఎంకే తమదే అని పన్నీర్ సెల్వం వర్గం చెబుతున్నా, వీరి వైపు ప్రజా ప్రతినిధుల బలం లేకపోవడంతో దానిని ముందుకు తీసుకెళ్లలేకున్నారు.