పరిటాల రవి అనుచరుడు చమన్ మృతి!

Monday, May 7th, 2018, 02:26:51 PM IST


దివంగత టిడిపి ఎమ్యెల్యే పరిటాల రవీంద్ర ప్రధాన అనుచరుడిగా వున్న చమన్ నేడు అకస్మాత్తుగా మృతిచెందాడు. విషయం లోకి వెళితే గత కొద్దిరోజులుగా పరిటాల రవి, సునీతల కుమార్తె స్నేహలత వివాహ వేడుక పనుల్లో బిజీగా వున్న చమన్ అనుకోకుండా సోమవారం ఉదయం ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కాగా ఆయన్ను వెంటనే పరిటాల సునీత అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. పరిటాల రవి సన్నిహితుల్లో అత్యంత ముఖ్యుడైన చమన్ 2004లో రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు అజ్ఞాతంలో వున్నారు.

ఆ తరువాత 2012లో అయన అజ్ఞాతం వీడి ప్రజల్లోకి వచ్చాడు. అయితే మళ్లి 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం అలానే పరిటాల సునీత మంత్రి కావడం చమన్ కు కొంత కలిసి వచ్చింది. కాగా ఆయన సార్వత్రిక ఎన్నికల అనంతరం వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున రామగిరి మండలం నుండి జెడ్పిటిసి గా పోటీ చేసి గెలుపొందారు. తమ కుమార్తె వివాహాన్ని ఎటువంటి లోపం లేకుండా జరపాలి అనుకున్న చమన్ వున్నట్లుండి మరణించడం బాధాకరమని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఆయన మరణంతో అనంతపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి………