బడ్జెట్ పై పార్టీ ఎంపీలతో రేపు ఏపీ సిఎం బాబు భేటీ..!

Thursday, March 1st, 2018, 06:42:03 PM IST


రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తన పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అవుతున్నారు. అయితే రేపు ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసంలోని గ్రీవెన్స్‌ హాలులో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ముఖ్యంగా పార్లమెంట్‌ సమావేశాల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ కేంద్ర ప్రభుత్వంపై పోరాట బాట చేపట్టింది. విభజన హామీల సాధనకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పార్లమెంట్‌ దద్దరిల్లేలా ఆందోళన చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే, బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడినందున ఆ పోరాటానికి తాత్కాలికంగా విరామం వచ్చింది. అయితే, మళ్లీ ఈ నెల 5 నుంచి సమావేశాలు అవనున్నందున విభజన హామీలతో పాటు రాష్ట్రానికి ప్రకటించిన హామీలన్నింటినీ సాధించేందుకు కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని, రాష్ట్ర హక్కుల సాధన, వివిధ పార్టీలు అనుసరిస్తున్న విధానంపై చర్చించే అవకాశాలుఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైకాపా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించడంతో ఆ అంశంపైన కుడా చర్చించే అవకాశం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఏవిధంగా ముందుకు వెళ్తే అనుకున్న అంశాలు నెరవేరుతాయో ఈ సమావేశంలో చర్చించనున్నారు.