త్రుటిలో తప్పిన ప్రమాదం: శంషాబాద్ విమానాశ్రయం…

Monday, March 5th, 2018, 04:21:45 PM IST

· పరిస్థితులను వెంటనే అదుపులోకి తీస్కున్న అధికారులు.

· ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు.

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పినట్టు ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు వెల్లడించారు. జెడ్డా నుంచి ఇండోనేషియా వెళ్తున్న సిటీలింక్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో ఇంధనం అయిపోవడంతో ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. విమానంలో ఇంధనం నింపుతుండగా అకస్మాత్తుగా లీకై రన్‌వేపై పడింది. దాన్ని గమనించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై విమానాన్ని నిలిపివేసి రన్ వేపై పడిన ఇంధనాన్ని ఫైరింజన్ల సహాయంతో శుభ్రం చేశారు. దాదాపు గంటసేపు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించి భారీ ప్రమాదాన్ని తప్పించారు. ఇదే విమానం టేకాఫ్ అయి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు చెప్తున్నారు. అనంతరం విమానం తిరిగి వెళ్లిపోయింది. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇకపై ఇలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎయిర్ పోర్ట్ సిబ్బంది జాగ్రత్త వహించాలని అధికారులు ఆదేశించారు.