కొనసాగుతున్న పవన్ ట్వీట్ల పరంపర !

Monday, April 23rd, 2018, 12:31:50 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్వీట్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇటీవల మూడు రోజుల క్రితం తనపై జరుగుతున్న కుట్రను, అవమానాలకు కొందరు వ్యక్తులు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కు వెళ్లి తన ఆవేదనను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. తన తల్లిని కావాలనే దుర్భాషలాడించారని, అలానే పలు మీడియా చానెల్స్ ఆ విషయాన్నీ పదే పదే ప్రసారం చేసి తనని అన్నివిధాలా దెబ్బకొట్టాలని చూస్తున్నాయని ఆయన ట్వీట్ ల ద్వారా తెలియచేస్తున్నారు. కానీ చేయాల్సిందంతా చేసేసి, ఇప్పుడు మధ్యవర్తుల ద్వారా తనకు క్షమాపణ చెబుతున్నారని పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత ఆరు నెలలుగా నన్ను మాత్రమే కాదు, నా అభిమానులను, స్నేహితులను, పార్టీ కార్యకర్తలను ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారు. ఇప్పుడు సినీ పరిశ్రమతో పాటు నా తల్లిని సైతం దూషించారు. కానీ ఇంత చేసిన తర్వాత మధ్యవర్తుల ద్వారానో, లేక వ్యక్తిగతంగానో క్షమాపణలు చెబుతున్నారు.

మనల్ని, మన తల్లుల్ని, ఆడపడుచులను తిట్టే పేపర్లను ఎందుకు చదవాలి. అలాంటి వార్తలు ప్రసారం చేసే టీవీ చానెళ్లను ఎందుకు చూడాలి. జర్నలిజం విలువలతో ఉన్న ఛానల్స్, పత్రికలు, సమదృష్టి కోణంతో కథనాలు ప్రచురించే, ప్రసారం చేసే పత్రికలు, చానెళ్ల తరఫున నిలబడతామని నేడు తన పోస్టులో పవన్ పేర్కొన్నారు. త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పాటుకి రంగం సిద్ధం అవుతుంది. వీరికి జనసేన “వీరమహిళా” విభాగం అండగా ఉంటుందని పవన్ వరుస ట్వీట్లు చేశారు. కాగా, పవన్ పోస్ట్ చేసిన కొంత సమయానికే ఆయన చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి. కాగా పలువురు పవన్ అభిమానులు ఆయన చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని కామెంట్ ల రూపంలో తెలియచేస్తున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments