సాధ్యాసాధ్యాలు ఆలోచించవా పవన్..?

Thursday, December 6th, 2018, 04:35:16 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాను రాను ఫక్తు రాజకీయ నాయకుడిలా మారిపోతున్నాడు. మొదట్లో ప్రస్తుత పాలకుల అవినీతిని ఎండగట్టిన పవన్, ఇప్పుడు ఆ పాలకుల అడుగు జాడల్లోనే నడుస్తున్నట్టు అనిపిస్తోంది. పార్టీ పెట్టిన మొదట్లో వ్యక్తిగత విమర్శలు చెయ్యను, ప్రజా సమస్యల పట్లే పోరాడతా అని చెప్పిన పవన్, అధికారం మీద వ్యామోహం లేదు, ప్రజల సంక్షేమమే లక్ష్యం అన్న పవన్, ఇప్పుడు తరచూ చంద్రబాబు, జగన్ లపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడు. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు.

తాజాగా జనతరంగం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్, అనంతపురంలో ఇంటింటికి వెళ్లి జన తరంగంలో పాల్గొన్నాడు. అలా ఓ ఇంటికి వెళ్లిన పవన్ వారి కష్టాలను చూడలేక ఇంటింటికి ఉచిత గ్యాస్ పంపిణి చేస్తా అని హామీ ఇచ్చేసాడు, అసలే డబ్బులు పెట్టనిదే మంచినీళ్లు కూడా దొరకని రోజులు ఇవి, ఆ మధ్య గ్యాస్ పైప్ లైన్లు లీక్ అవుతున్న కూడా గ్యాస్ కంపెనీలు పట్టించుకోని పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముడి చమురు ధరలు పెరగటంతో సబ్సిడీపై సరఫరా చేసే గ్యాస్ ధరలను పెంచేస్తూ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాయి, ఇలాంటి పారిస్తుతుల్లో ఉచితంగా గ్యాస్ సరఫరా చేస్తా అంటూ హామీ ఇవ్వటం పవన్ అవగాహనా రాహిత్యాన్ని సూచిస్తోంది.

గతంలో మీరు ఉచితంగా ఇచ్చే పప్పులు, బియ్యం ఎవరికీ కావాలి, ఉద్యోగాలు ఇవ్వండి అంటూ నిలదీసిన పవన్ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వస్తువులకు బదులు నేరుగా అకౌంట్లలో డబ్బులేస్తా మీకు కావాల్సింది కొనుక్కొని తినండి అంటున్నాడు. చంద్రబాబు లాంటి నాయకుడు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయలేక నానా సాకులు చెప్పి రుణమాఫీ భారాన్ని తగ్గించుకున్నాడు. అలాంటిది ఉచిత గ్యాస్ సరఫరా, రేషన్ కు బదులుగా డబ్బుల పంపిణి పథకాలు ఎలా సాధ్యం అనుకున్నాడో పవన్ కళ్యాణ్. బహుశా చంద్రబాబుతో నాలుగేళ్లు సహవాసం చేయటం వాళ్ళ ఏమో పవన్ కు కూడా “ఆల్ ఫ్రీ” హామీలిచ్చే అలవాటు వచ్చింది.