నిరాహార దీక్ష దిశగా పవన్ అడుగులు ?

Thursday, February 8th, 2018, 12:40:05 AM IST

ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులుగా బీజేపీ మరియు టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, అంతే కాక బిజెపి రాష్టం లో అణచివేయాలని చూస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ. అయితే టిడిపి నేతలు కూడా కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఏపీ ని చిన్నచూపు చూస్తోందని, తద్వారా అభివృద్ధి కుంటుపడుతోందని వారు విమర్శిస్తున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో ఈ మాటల యుద్ధం మరింత పెరిగింది. బడ్జెట్ లో ఏపీ కి తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుండడంతో, రాష్ట్ర ఎంపీ లు తమ నిరసన గళాన్ని పార్లమెంట్‌లో వినిపించారు.

అయితే ప్రస్తుతం ఇదే అంశం పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కేంద్ర బిజెపి వైఖరిని నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్రం ముందు నిలదీయాలని నిర్ణయించినట్లు త్లెలుస్తోంది. అంతే కాక ఆయన న్యాయం కోసం నిరాహార దీక్ష కూడా చేయబోతున్నట్లు పార్టీ వర్గాల నుండి సమాచారం. అక్కడి జంతర్‌మంతర్ వేదికగా ఈ దీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా క్రితం ఎన్నికల్లో మోదీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ విషయమై పవన్ కాసేపట్లో కీలక ప్రకటన ఒకటి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి….