గాజువాకలో ఓటర్లు పవన్ కళ్యాణ్ కి కావాలనే దెబ్బేశారా…?

Sunday, May 26th, 2019, 09:43:35 PM IST

ఏపీలో ఇక ఎన్నికల హడావుడి ముగిసింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా టీడీపీ కొన్ని సీట్లకే పరిమితమవ్వగా, మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన మాత్రం కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. ఎన్నికల ముందు చాల హడావుడి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికల ఫలితాల తరువాత చాలా డీలా పడిపోయారు. అయితే అందరు కూడా ఒకే ఒక్క స్థానంలో పోటీ చేయగా జనసేనాని మాత్రం గాజువాక, భీమవరంల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి, రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. కాగా పవన్ భీమవరంలో గెలవదని చాలా మంది చెప్పుకున్నప్పటికీ కూడా గాజువాకలో తప్పకుండ గెలుస్తాడని చెప్పారు. కారణం గాజువాకలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వారు చాలా మంది ఉండటమే కారణం. కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ గాజువాకలోనూ ఓడిపోయి తనకి ఇక ఓటు బ్యాంకు లేదని తెలుసుకున్నాడు.

అయితే పవన్ గాజువాక ప్రజలను అంతలా నమ్మడానికి కారణం కూడా లేకపోలేదు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కూడా గాజువాకలో గెలిచింది. అంతేకాకుండా అక్కడ కాపు సామాజికానికి చెందిన వారు ఎక్కువగా ఉండటంతో పవన్ గెలుపు ఖాయం అని అనుకున్నారు. అయితే పవన్ కూడా తన ప్రసంగాల్లో నాకు కులం లేదు, మతం లేదు అంటూ చాలా మాట్లాడాడు, దానికి తోడు పవన్ తన మకాంని కూడా గాజువాకకే మార్చుకున్నాడు. కానీ పవన్ కి సినిమాల్లో ఉన్న ఆదరణ, ప్రేమ అన్ని కూడా రాజకీయాల్లో లేవని తెలుసుకోలేకపోయారు. అయితే గతంలో ప్రజారాజ్యం ఎఫెక్ట్ తరువాత వారి కుటుంబానికి అంతలా ఆదరణ లేదని పవన్ మాత్రం గ్రహించలేకపోయాడు.

అయితే గాజువాకలో కేవలం కాపులే కాదు యాదవ, ఇతర బీసీ కులస్తులూ ఉన్నారు. తెలుగు దేశం పార్టీకి మరొక మొహం లా మారిన జనసేనను మిగతా వర్గాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి తరపున చంద్రబాబు గాజువాకలో కనీసం ప్రచారం కూడా చేయలేదు, కాగా పవన్ కూడా చంద్రబాబుకి మద్దతుగా ఉంది మంగళగిరిలో ప్రచారం చేయలేదు. ఈ సంఘటనతో మాత్రం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది పవన్ చంద్రబాబుకి మద్దతు ఇస్తున్నాడని… ఈ కారణాలన్నింటి వలన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ప్రజలెవరూ కూడా నమ్మలేరని చెప్పవచ్చు…