కత్తి విషయం లో పవన్ మౌనం వహించడమే మంచిది : ఉండవల్లి అరుణ్ కుమార్

Wednesday, January 17th, 2018, 04:04:41 PM IST

రాజమండ్రి మాజీ కాంగ్రెస్ యం పి ఉండవల్లి అరుణ్ కుమార్ తాజా రాజకీయ పరిణామాల పై తన స్పందన తెలిపారు. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్థాపించిన జన సేన పార్టీ కి భవిష్యత్తులో మంచి పేరు సాధించే అవకాశం ఉందని, అలానే ఆ పార్టీ రాష్ట్రం లో ఒక ఫోర్స్ లా తయారవుతుందని ఆయన జోశ్యం చెప్పారు. పవన్ ప్రస్తుత రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించి ప్రతి ఒక్క అడుగు ముందకు వేయాలని ఆయన సూచించారు. రాజకీయాల్లో అన్నిటికంటే సంయమనం తో వ్యవహరించడం ముఖ్యమని ఆయన అన్నారు. అయితే ఇటీవల సినీ విమర్శకులు కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పై చేస్తున్న పరోక్ష దాడికి పవన్ తిరిగి స్పందించకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నేత అయిన పవన్ బాధ్యతతో వ్యవహరిస్తే భవిష్యత్తు బాగుంటుందని, అది పవన్ చేతుల్లోనే వుందని, మరింత మందికి అది ఆయన్ని చేరువ చేసేలా చేస్తుందన్నారు, భవిష్యత్తులో ఆయన తప్పక విజయం సాధిస్తారని చెప్పారు. అయినా కత్తి మహేష్ మాటలు మొదట్లో చాలా అర్ధవంతంగా వుండెవని, తరువాత ఆయన వాదన చాలా రొటీన్ గా తయారయిదని చెప్పుకొచ్చారు. తన మాటలను తెలివిగా సమర్ధించుకునే కత్తి మహేష్, పవన్ పై ఎంతో కొంత ముందుగానే స్కోర్ చేసుకుని మాట్లాడుతున్నట్లు తెలుస్తోందని, అయితే తన చేసే విమర్శలకు పవన్ అభిమానులు సమాధానమిస్తున్నారని, పవన్ ఈ విషయం లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉంటేనే మంచిదని హితవు పలికారు. రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజల నాడి తెలుసుకోవాలని, ప్రతి పార్టీ కి సొంత మద్దతుదారులు, సానుభూతి పరుల రూపంలో కొంత ఓటు బ్యాంకు అనేది ఉంటుందని, కానీ అన్నిటికంటే ముఖ్యం తటస్థ ఓటర్లని, తమ మద్దతుదార్లకంటే ప్రతి ఒక పార్టీ తటస్థుల పై దృష్టిపెడితే విజయం తధ్యమని అన్నారు.