పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు – మీరు నా శవాన్ని మోసుకెళ్ళేవరకు నేను మీకోసమే పోరాడుతా

Sunday, June 9th, 2019, 10:32:04 AM IST

గుంటూరు జిల్లాలోని మంగళగిరి జనసేన కార్యాలయంలో పలు జిల్లాల్లో పోటీ చేసే అభ్యర్థులతో భేటీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు… తన జీవితం ఇక రాజకీయాలకే అంకితం అని, మళ్ళీ సినిమాల్లోకి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు… అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేవాడిని కాదని, విజయం సాధించేవరకు కూడా అలుపెరగకుండా పోరాడుతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఓటమి నాకు కొత్తేమి కాదని, ఓడిపోయినా ప్రతిసారి పైకి లేస్తానని, మళ్ళీ బలంగా గెలుస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకోసం మద్దతుగా పెట్టి ఈ జనసేన పార్టీని ఒక్క ఓటమి ఆపలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తమకు ప్రజాభిమానం ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో గెలవలేకపోయామని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన గెలుపొందేలా కృషి చేయాలనీ నేతలకు పవన్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలతో సంబంధం లేకుండా జనంలో కలిసిపోవాలని పవన్ సూచించారు. ఈ మేరకు విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్… ‘నా జీవితం రాజకీయాలకు అంకితం. నేను మళ్లీ చెబుతున్నా.. నా శవాన్ని నలుగురు మోసుకెళ్లే వరకు నేను జనసేనను మోస్తా. ఓటమి నాకు కొత్త కాదు. దెబ్బతినే కొద్దీ ఎదిగే వ్యక్తిని నేను. 25 ఏళ్ల లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా.. ఓటమి ఎదురైతే తట్టుకోగలనా? లేదా? అనేది పరీక్షించుకున్న తర్వాతే తాను పార్టీ స్థాపించినట్లు పవన్ తెలిపారు. అంతేకాకుండా తనను ఓడించేందుకు రూ.150 కోట్ల వరకూ ఖర్చు చేశారని, ‘పవన్‌ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వొద్దని ప్రత్యర్ధులు లక్ష్యంగా పెట్టుకొని కుట్రపూర్తితమైన రాజకీయాలకు తెరతీశారని అన్నారు. ఏదేమైనా కూడా ప్రజా తీర్పును గౌరవిస్తూ ముందుకెళ్లాలని పవన్ నేతలకు సూచించారు.