జనసేనాని సంచలన నిర్ణయం – సొంత పత్రిక యోచనలో పవన్

Thursday, June 6th, 2019, 09:40:33 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. జనసేన పార్టీ తరపున ఒక పత్రిక పెడుతున్నట్లు జనసేనాని నేడు ప్రకటించారు. పార్టీకి సంబందించిన భావజాలం, పార్టీ ప్రణాళికలు, పార్టీ నిర్ణయాలు, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా కథనాలు ఉండాలని, ప్రజల కొరకు పోరాటం చేసే ప్రతి అంశాన్ని అందులో వ్యక్త పరచాలని జనసేనాని స్పష్టం చేశారు. అంతేకాకుండా మేధావులందరు కూడా తమ తమ అభిప్రాయాలను వెల్లడించడానికి వేదికగా ఒక పత్రికను నడపాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు… ఇంకా ఇందులో పార్టీకి సంబందించిన అంశాలే కాకుండా ప్రజల యొక్క అభిప్రాయాలను, వారి సమస్యలని, వారి పోరాటాలను అన్నింటిని కూడా సమిష్టిగా పొందు పరచాలని నిర్ణయించారు.

అంతేకాకుండా ఈ పత్రికలో రాష్ట్ర, దేశ విదేశాలకు చెందిన పాలసీ నిర్ణయాలు, అభివృద్ది రంగాలకు చెందిన సమాచారం అందించాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు వాటి పరిష్కారానికి ఈ పత్రిక తోడ్పడాలని ఆకాంక్షించారు. కాగా పత్రిక తొలి ప్రతిని సెప్టెంబర్‌లో విడుదల చేస్తామన్నారు. పత్రిక ఈ-మ్యాగజైన్‌తో పాటు ముద్రిత సంచికను కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంచుతామన్నారు. కాగా ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత తెలపాలని పవన్ తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… తనతో పాటు ఈ పోరాటంలో పాల్గొనే వారందరు కూడా నిజాయితీగా ఉండాలని, వారికీ కీర్తి ప్రతిష్టలు వస్తాయి కానీ ఎలాంటి డబ్బు రాదనీ పవన్ స్పష్టం చేశారు. కాగా తన తుడు శ్వాస విడిచేవరకు కూడా జనసేన పార్టీ ని ముందుకు తీసుకెళ్తుంటానని, సొంత లాభం ఏమి ఆలోచించకుండా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని పవన్ స్పష్టం చేశారు.