ఆ ఫోన్ వచ్చాకే పవన్ టోన్ మారింది : జేసి కుమారుడు పవన్ రెడ్డి

Friday, July 13th, 2018, 09:05:38 PM IST

అనంతపురం ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ఏది మాట్లాడినా చాలా సూటిగా, వున్నది ఉన్నట్లు మాట్లాడుతుంటారు. అలా మాట్లాడి ఆయన కొన్నిసార్లు విమర్శలపాలయ్యారు. ఇక ప్రస్తుతం ఆయన తనయుడు జేసి పవన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణపై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తో తనకు వ్యక్తిగతంగా మంచి పరిచయం ఉందని, ఆయన భావాలూ, ఆశయాలు మంచి స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు. జనసేన పార్టీ స్థాపించిన తరువాత పవన్ పై, అయన పార్టీ పరిస్థితిపై తనకు కొంత అవగాహన వుందని, నిన్న మొన్నటివరకు టిడిపితో ఎంతో సఖ్యతగా మెలిగిన పవన్ వున్నట్లుండి ఎందుకు చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడుతున్నారో తనకు అర్ధం అయ్యేది కాదని అన్నారు. కానీ ఇటీవల తనకు వున్న సమాచారం మేరకు పవన్ కు కొన్నాళ్ల క్రితం కేంద్రం నుండి ఒక ఫోన్ వచ్చిందని, అందులో వారు ఇకపై మీరు టీడీపీకి సహాయకారిగా ఉండకూడదు, మీకు మేము సాయం చేస్తాం అని అన్నారని, అందువల్లనే ఆ మరుసటి రోజునుండి పవన్ టోన్ మారి టీడీపీని టార్గెట్ చేసారని విమర్శించారు.

ఇప్పటికే టీడీపీ పై బురద జల్లే ప్రయత్నం చేసిన వైసిపికి గత ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితి వచ్చిందో అందరికి తెలుసునని, పవన్ వామపక్షాల మరియు బీజేపీ అండతో ముందుకు సాగడం చాలా కష్టమని అన్నారు. ప్రస్తుతానికి జనసేనలో చేరికలు బాగానే ఉంటాయి, ఎందుకంటె టీడీపీ మరియు వైసిపి పార్టీల్లో టిక్కెట్లు దక్కని వారే ఎక్కువగా ఆ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా తమ పార్టీకి అధికారం కట్టపెడతారని, చంద్రబాబు మళ్ళి ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారని అన్నారు. మాకు ఎవరి అండదండలు, మద్దతు అవసరం లేదు, మా పార్టీ పధకాలు, సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీవారు ఏపీకి ఏవిధంగా అన్యాయం చేశారో అందరికి తెలుసునని, అయినప్పటికీ చంద్రబాబు మాత్రం మొక్కవోని దీక్షతో రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి పథాన నడిపిస్తున్నారని అన్నారు. ఆయన కష్టం వృధా పోదు అనే నమ్మకం తనకు ఉందని స్పష్టం చేసారు….

  •  
  •  
  •  
  •  

Comments