త్రిముఖ పోటీ తప్పకుండా ఉంటుంది: పవన్

Friday, May 18th, 2018, 09:34:02 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అసలైన రాజకీయ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో వరుస యాత్రలతో జనాలను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి యాత్ర కోసం విశాఖపట్టణం కి వెళ్లిన జనసేన అధినేత పవన్ అంబేద్కర్ భవన్‌లో జనసేన పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపి పోరాట యాత్ర గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నేను చేపట్టబోయేది బస్సు యాత్ర కాదు పోరాట యాత్ర. అంతే కాకుండా భవిష్యత్తులో ప్రజల కోసం పాదయాత్ర కూడా చేయనున్నట్లు పవన్ తెలిపారు.

45 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రలో అన్ని జిల్లాలను కలుపుకుంటు వెళతామని చెప్పారు.ఇక ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం నుంచి యాత్రను మొదలు పెట్టడం సంతోషంగా ఉందని ఇచ్చాపురం లో మొదట 20న అమరవీరులకు నివాళులు అర్పించిన తరువాత గంగమ్మకు పూజలు చేసి యాత్రను మొదలుపెట్టనున్నట్లు పవన్ తెలుపుతూ.. 175 స్థానాల్లో కచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. అదే విధంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుందని పవన్ నమ్మకంగా తెలియజేశారు.