బహిరంగంగా వాళ్ల తోలు తీసెయ్యాలి.. పవన్ ఆగ్రహం

Sunday, April 15th, 2018, 03:28:58 AM IST

ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ జనాల నుంచి ప్రముఖుల వరకు అందరు ఈ విషయంపై చాలా సీరియస్ అవుతున్నారు. ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఘటనపై ఆగ్రహంగా స్పందించారు. నేడు పార్టీ కార్యాలయంలో జనసేన మహిళా విభాగం ప్రతినిధులతో అలాగే విద్యార్థులతో పవన్ మాట్లాడారు.

పవన్ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఎంతో బాధను కలుగజేసింది. ఇలాంటి ఘటనలు కొత్త కాదు. ఓ దుర్ఘటన జరిగితే గాని చలనం రాదు. ఆడపిల్లల్ని వేదించే వారిని బహిరంగంగా ఈడ్చుకొచ్చి శిక్షించాలి. అప్పుడే అందరికి భయం కలుగుతుంది. ఢిల్లీ ఘటన జరిగిన తరువాతే నిర్భయ చట్టం వచ్చింది. కళ్లముందు జరిగితే గాని ఎంపీలు స్పందించరా?. ఇక సినిమాల ప్రభావం వల్ల మహిళలపై వేధింపులు పెరిగాయి అంటారు. ఆ చిన్నారి హత్యకు అత్యచారానికి కళలు ప్రేరేపించాయా? అని ప్రశ్నిస్తూ.. మనిషిలో పశువాంఛతో జరుగుతున్న దారుణాలివి. పశువుకైనా ప్రకృతి నియమం ఉంటుంది. కానీ మానవమృగానికి ఏమి ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జనసేన తరఫునుంచి ఆడపిల్లల్ని వేదించే వారి విషయంలో కఠినంగా ఉండలని శిక్షలు కూడా కఠినంగా ఉండలని చెబుతూ.. ఆడపిల్లల జోలికి వస్తే.. బహిరంగంగా తోలు తియ్యాలని పవన్ కోరారు.