వాడేశానని బాబు అనుకుంటున్నాడు.. నిజానికి వాడుకుంది పవన్ !

Friday, January 11th, 2019, 12:15:42 PM IST

ప్రత్యేక హోదా సాధనలో జాప్యం, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయింది టీడీపీ. అందుకే ఆ పార్టీకి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుని ప్రశ్నించే పని మొదలుపెట్టాడు పవన్. కానీ ప్రత్యర్థులు అసలు మద్దతివ్వడం ఎందుకంటున్నాయి. అధికార టీడీపీ అయితే మీ మద్దతు వలన ఒరిగిందేమీ లేదంటోంది. వీటిపై ఇన్నిరోజులు స్పందించని పవన్ ఇప్పుడు స్పందించారు. 2014లో టీడీపీకి మద్దతివ్వడం అనేది ఒక సామాజిక ప్రయోగం అన్నాడు.

ఈ ప్రయోగం ఫలించింది కాబట్టే ఈనాడు జనసేన వేగంగా దూసుకుపోతోందని తెలిపారు. పవన్ చెప్పిన ఈ మాటలో నిజం ఉంది. ఎన్నికల్లోకి దిగేముందు అసలు తన బలమేంటో తానే తెలుసుకోవాలనుకున్నాడు పవన్. అందుకే టీడీపీకి మద్దతిచ్చాడు. టీడీపీ గెలుపుతో ప్రజల్ని ప్రభావితం చేయగల సత్తా ఆయనకుందని తేలింది. ఆ నమ్మకంతోనే టీడీపీకి గుడ్ బై చెప్పేసి ధీమాగా బయటికొచ్చాడు.

ఈ పొత్తులో ఆయన చెబుతున్న మరో అంశం నైతిక బలం. అవును… పనిచేసి పెట్టని వాళ్ళకి ఫలితంపై ప్రశ్నించే హక్కు లేదనేది నేటి సూత్రం. ఒకవేళ పవన్ టీడీపీకి 2014లో మద్దతివ్వకుండా ఇప్పుడు విమర్శిస్తున్నట్టే విమర్శిస్తే బాబు ఊరుకుంటాడా. అసలు నువ్వు ఎవరు, ఏం వెలగబెట్టావ్ అంటాడు. చిరంజీవిని చూపించి వెటకారంగా మాట్లాడేవాడు. కానీ పవన్ మద్దతిచ్చి ఉన్నాడు కాబట్టి ఏదో కొద్దిగా సమాధానం అయినా చెబుతున్నాడు. అంటే 2014లో జనసేనను వాడుకున్నాడు బాబు అనుకుంటున్నాడు కానీ నిజానికి పవనే టీడీపీని వాడుకున్నాడన్నమాట.