బాబుని మించిపోతున్న పవన్ ముందుచూపు..!

Wednesday, February 22nd, 2017, 03:50:13 AM IST


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల నేపథ్యంలో తన ప్రణాళికల గురించి తానే లీకులు ఇస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.తన ప్రణాళికల గురించి ప్రరోక్షంగా ప్రస్తావిస్తూ తానెంత ముందుచూపుతో వ్యవహరిస్తున్నానో చెప్పకనే చెబుతున్నాడు. మంగళగిరిలో జరిగిన చేనేత సత్యాగ్రహం సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి, 2019 ప్రణాళికల గురించి ప్రస్తావించారు. మర్చి 14 నాటికి జనసేన పార్టీ ఆవిర్భావమై మూడేళ్లవుతుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ వెబ్ సైట్ ని ప్రారంభిస్తానని పవన్ అన్నారు.అందులో వ్యవసాయం, రాజధాని, చేనేత, పరిశ్రమలు అని రంగాలకు సంభందించిన సూచనలు, అభిప్రాయాలను ప్రజలు పేర్కొనవచ్చని పవన్ అన్నారు. ప్రజల అభిప్రాయాల ఆధరంగానే జనసేన పార్టీ మేనిఫెస్టో 2019 లో తయారవుతుందని పవన్ ప్రకటించడం విశేషం. జనసేన పార్టీ లో యువతకే పెద్ద పీట వేస్తానని పవన్ స్పష్టం చేసారు.

2019 ఎన్నికలకు ఇంకా సుదీర్ఘ సమయం ఉండగానే పవన్ అప్పుడే ఎన్నికల మేనిఫెస్టో గురించి కసరత్తు మొదలుపెట్టాడని చర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయంగా ముందుచూపు ఎక్కువనే కామెంట్లు వినిపిస్తూంటాయి.ఆ విషయం లో పవన్ చంద్రబాబుని ఫాలో అవుతున్నాడా అనే చర్చ జరుగుతుండడం విశేషం.ఒకపార్టీని బలోపేతం చేయాలంటే సమాజం లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు చేరువకావాలి. అందుకోసమే కేవలం రైతుల సమస్యలే కాకుండా అన్ని వర్గాలతో మమేకం అయ్యేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకిని కాదు అంటూనే చిత్తశుద్ధి కలిగిన వారు రాజకీయాల్లో ఉండాలని చురకలు అంటించారు.

తన పార్టీ వారైనా ప్రజాసమస్యలను పట్టించుకోనివారిని, అక్రమాలకు పాల్పడేవారిని ఉపేక్షించను అని చెబుతూ తనేత కఠినంగా వ్యవహరించదలుచుకున్నానో ప్రజల్లోకి సంకేతాలు పంపారు.ఇప్పటికే సభలు సమావేశాలు ద్వారా ప్రజల్లోకి చేరువవుతున్న జనసేన అధినేత పవన్, ప్రజలకు చేరుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంపై దృష్టిపెట్టాడు. 2019 ఎన్నికల లోపాలు ప్రజలను చేరుకోవడానికి ఇదే ఉత్తమ మైన మార్గమని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూంటారు. జనసేన పార్టీ కూడా సోషల్ మీడియా లో విరివిగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు త్వరలో వెబ్ సైట్ ని ప్రారంభించి దాని ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని పవన్ భావిస్తున్నట్టు;యూ తెలుస్తోంది.

ఫోటోలు : చేనేత సత్యాగ్రహం సభలో పవన్ కళ్యాణ్