జల్లికట్టు, కోడిపందెం వివాదం..లాజిక్ పట్టుకున్న జనసేనాని..!

Friday, January 20th, 2017, 03:07:33 PM IST

pk
జల్లికట్టు పై నిషేధంతో తమిళనాడు నిరసనలతో హోరెత్తుతోంది.జల్లికట్టు పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆందోళనలు చేస్తున్న యువతతో సినీరాజకీయ ప్రపంచం ఏకమై చేతులు కలిపింది.దక్షిణ భారత లోని సినీరాజకీయ వర్గాలు జల్లికట్టుకు మద్దత్తు ప్రకటిస్తున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని తెలియజేసారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు.జల్లికట్టుకు, కోడి పందేలకు పవన్ తన మద్దత్తు ప్రకటించారు. తమిళ సాంప్రదాయ క్రీడ జల్లికట్టు ని నిషేధించడం అంటే ద్రవిడ సంస్కృతి పై, దేశ సమగ్రత పై దాడి చేయడమే అని అభివర్ణించారు.

దక్షణ భారతంపై కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరి ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తోందని పవన్ ఆరోపించారు.జంతు మాంసాన్ని(ఆవులు, గేదెలు, ఎద్దులు) ఎగుమతి చేయడంలో మనదేశం ప్రథమస్థానంలో ఉందని పవన్ అన్నారు. 2015 లో భారత్ నుంచి 2.4 టన్నుల బీఫ్ ఎగుమతి జరిగిందని పవన్ అన్నారు. తరువాతి స్థానాల్లో ఉన్న బ్రెజిల్ మరియు ఆస్ట్రేలియాల నుంచి కేవలం 2 మిలియన్ టన్నులు మరియు 1.5 మిలియన్ టన్నుల బీఫ్ మాత్రమే ఎగుమతి జరిగిందని అన్నారు. ఆవులను,ఎద్దులను చంపకుండానే ఇంతమొత్తంలో మాంసం ఎగుమతి జరుగుతుందా అని ప్రశ్నించారు. కానీ ఎద్దులకు హాని జరగని జల్లికట్టు పైనే నిషేధం విధించడంలో ఆంతర్యం ఏంటని పవన్ ప్రశ్నించాడు. అదేవిధంగా పవన్ కోడిపందేల పై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.కోడిపందేలు ఆంధ్రుల సంప్రదాయాల్లో భాగమని పవన్ అన్నారు.కేంద్రం జల్లికట్టు, కోడిపందేల పై నిషేధం విధించేముందు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమల పై నిషేధం విధించాలని పవన్ అన్నారు.