బ్రేకింగ్: జనసేన ఎంపీ అభ్యర్థిగా నాగబాబు – నరసాపురం నుండి పోటీ..!

Wednesday, March 20th, 2019, 12:24:05 PM IST

జనసేన తరఫున మెగాబ్రదర్ నరసాపురం ఎంపీగా బరిలో దిగనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి, అయితే పార్టీ నుండి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాకపోవటంతో ఆ వార్తలను రూమర్లు గానే భావించారు. తాజాగా నరసాపురం నుండి ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ జనసేన పార్టీ ప్రకటించింది. దీంతో జనసేనకు మెగా ఫ్యామిలీ నుండి బలం చేకూరినట్లే అయ్యింది. నాగబాబు ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ జనసేన ఆవిర్భావం నుండి ఆ పార్టీకి మద్దతిస్తూ అభిమాన సంఘాలతో భేటీ అవుతూ పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని పార్టీ కోసం కార్యకర్తగా పని చేస్తానని వెల్లడించారు.

ఇదిలా ఉండగా నరసాపురం ఎంపీ సీటు విషయంలో రెండు రోజుల నుండి హై డ్రామా నడిచిందని సమాచారం, ఆ స్థానాన్ని ఇటీవల పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడుకి ఇవ్వాలని జనసేన పార్టీలోని ఓ వర్గం పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెచ్చిందని, అందుకే నిన్ననే నాగబాబును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ వారి ఒత్తిడి వల్ల ప్రకటించలేదని సమాచారం అందుతుంది. ఎట్టకేలకు నాగబాబును ఎంపీ అభ్యర్థిగా ప్రకటిచేశారు, ఇక జనసైనికుల్లో మెగా అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొనటం ఖాయం. దీనికి మెగా హీరోలు రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు ఎన్నికల ప్రచారానికి రానున్నారని ఇటీవలే వార్తలొచ్చాయి. దీంతో ఇన్నాళ్లు సినీ గ్లామర్ తక్కువైందనుకున్న జనసేనకు ఒక్కసారిగా మెగాబలం చేకూరినట్లైంది.