ప్ర‌శ్నించ‌డానికి కాదు.. సీయం కుర్చీ కోసమే.. రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం..!

Thursday, November 8th, 2018, 11:44:45 AM IST

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాను ప‌ద‌వ‌ల కోసం రాజ‌కీయాల్లోకి రాలేద‌ని.. ప్ర‌జ‌ల త‌రుపున‌ ప్ర‌శ్నించ‌డానికే వ‌చ్చాన‌ని ప‌లు మార్లు.. స్టేజ్ మీద బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేనే అధికారంలోకి వ‌స్తుంద‌ని.. తానే ముఖ్య‌మంత్రిని అని త‌న బ‌హిరంగ స‌భ‌ల్లో మాట్లాడుతూ ఉద‌ర‌గొట్ట‌డ‌మే కాకుండా త‌న అభిమానుల‌తో తానే సీయం నినాథం మ‌హామంత్ర‌మ‌ని చెప్పి మరీ పిలిపించుకుంటున్నారు ప‌వ‌న్ కళ్యాణ్‌.

దీంతో ప‌వ‌న్ పై రాజ‌కీయ వ‌ర్గాల్లో విమ‌ర్శ‌లు త‌లెత్తుతున్నాయి. గ‌తంలో జ‌గ‌న్‌లా త‌న‌కు ప‌ద‌వీ కాంక్ష లేద‌ని.. ప్ర‌జా స‌మ‌స్య‌ల పై పోరాట‌మే జ‌న‌సేన ముఖ్య ఎజెండా అని.. జ‌గ‌న్ వ‌ద్ద‌కు ఏ స‌మస్య వ‌చ్చినా ముఖ్య‌మంత్రి అయ్యాక చేస్తానంటాడ‌ని.. అత‌నేం ప్ర‌తిప‌క్ష నాయ‌కుడ‌ని గ‌తంలో ప‌వ‌న్ చాలా సార్లు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు మాత్రం ప్లేటు మార్చి నేనే సీయం అంటూ ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. దీంతో ప‌ద‌వీకాంక్ష లేని రాజ‌కీయ నాయ‌కుడు ఉండ‌డ‌ని.. ప‌వ‌న్ కూడా అందుకు మిన‌హాయింపేమీ కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

నిజ‌మే మ‌రి రాజ‌కీయాల్లో మ‌నుగ‌డ సాధించాలంటే.. నోట్లు, కాలాలు, ప‌క్క పార్టీ నాయ‌కులు.. ఇలాంటి జిమ్మిక్కులు స‌ర్వ‌సాధార‌ణ‌మే అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. దీంతో ఎంద‌రో మ‌హానాయాకుల త‌ర్వాత కొన్నేళ్లుగా చంద్ర‌బాబును చూస్తున్నాం.. జ‌గ‌న్‌ని చూస్తున్నాం.. ఇప్పుడు కొత్త‌గా ప‌వ‌న్‌ని చూస్తున్నాం.. అంద‌రికీ అధికారం కావాలి, ప‌ద‌వులు కావాలి, ప్ర‌జ‌లు మాత్రం ఏమైనా ప‌ర్వాలేదు. ఇక జ‌నాల‌కి ఏదో చేయాల‌నే క‌సి ప‌వ‌న్‌లో ఉంద‌ని జనాల్లో ఒక అభిప్రాయం ఉండేది.. అయితే తాజాగా ప‌వ‌న్ చేసిన నేనే సీయం వ్యాఖ్యతో ప‌వ‌న్ కూడా ఒక రాజ‌కీయనాయ‌కుడే అని.. లీడ‌ర్ కాద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.